దైవ దర్శనానికి వెళ్లి అనంతలోకాలకు
● ఘాట్ రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
పద్మనాభం: పద్మనాభంలోని అనంత పద్మనాభ స్వామి ఘాట్ రోడ్డులో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రామారావుపేటకు చెందిన ఒకే కుటుంబంలోని ఏడుగురు ఆదివారం కారులో పద్మనాభం వచ్చారు. కొండపై ఉన్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో వంద మీటర్లలో కిందనున్న అర్చకునిపాలెం రోడ్డుకు చేరుకుంటారనగా.. కారు అదుపు తప్పి కుడివైపు ఉన్న నీలగిరి తోటలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గంటి ప్రసాద్ (28) తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న పి.ఆదిత్య కుమారుడు పి.హరిహరన్ పెదవిపై, అతని భార్య సుప్రియకు నడుము, కుడి భుజంపై గాయాలయ్యాయి. వీరితో పాటు పి.సాయికిరణ్, పి.అనుష్‌లకు కూడా గాయాలయ్యాయి. ఆదిత్య, సమన్వితకు ఎటువంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను పద్మనాభం 108 అంబులెన్సులో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీఐ సి.హెచ్.శ్రీధర్ మాట్లాడుతూ.. ఘాట్ రోడ్డులో కారు దిగుతున్నప్పుడు న్యూట్రల్‌లో పెట్టడం లేదా అతివేగం కారణంగా వాహనం అదుపు తప్పి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. దీనిని మోటార్ వెహికల్స్ అధికారులు నిర్ధారించాల్సి ఉందని పేర్కొన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దైవ దర్శనానికి వెళ్లి అనంతలోకాలకు


