నిబంధనలకు పాతర.. స్టాండర్డ్స్‌ లేని కౌన్సిల్‌ | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు పాతర.. స్టాండర్డ్స్‌ లేని కౌన్సిల్‌

Jan 6 2026 7:27 AM | Updated on Jan 6 2026 7:27 AM

నిబంధనలకు పాతర.. స్టాండర్డ్స్‌ లేని కౌన్సిల్‌

నిబంధనలకు పాతర.. స్టాండర్డ్స్‌ లేని కౌన్సిల్‌

అమ్ముడుపోయిన అధికారులు..

ప్రజాప్రతినిధులు

భార్య..కన్నకొడుకుని చూడలేని వ్యక్తి కౌన్సిల్‌ సభ్యుడా?

నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేటర్‌ భర్తకు అవకాశం

జీవీఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ తీరిది

డాబాగార్డెన్స్‌(విశాఖ): జీవీఎంసీ అక్రమాలకు అడ్డాగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి తమ అనుయాయులకు పదవులు కట్టబెట్టడంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేయడం లేదు. తప్పు అని తెలిసినా అధికార మదంతో వరుసగా పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. దీనికి నిదర్శనమే నిబంధనలను నీళ్లొదిలి ఒక కార్పొరేటర్‌ భర్తకు జీవీఎంసీలో కీలక పదవి కట్టబెట్టడం. అక్కడితో ఆగకుండా కట్టుకున్న భార్యను, కన్న కొడుకును వదిలేసిన వ్యక్తిని సైతం జీవీఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా నియమించడం విశేషం. ఈ అక్రమ నియామకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే, తాము డబ్బులు పెట్టి పదవులను కొనుక్కున్నామని బహిరంగంగానే సమాధానం చెబుతుండటం గమనార్హం. అర్హత, నీతి నియమాలను పక్కన పెట్టి సాగుతున్న ఈ అక్రమ పదవుల పంపకంపై నగర ప్రజలు , పౌర సమాజం తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తోంది.

కట్టుకున్న భార్యని..

కన్నకొడుకుని వదిలేసిన వ్యక్తికా?

ఈ నియామకాల్లో మరో విస్తుపోయే అంశం ఏమిటంటే, నైతిక విలువలను కూడా విస్మరించడం. 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న తన భార్య విమలను, దివ్యాంగుడైన కుమారుడిని పదేళ్ల క్రితమే వదిలేసిన కారి గోవిందరాజును స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా నియమించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం మేయర్‌ చాంబర్‌కు వెళ్లిన విమలు తన ఆవేదనను వెలిబుచ్చింది. అయితే పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు తీసుకుంటానని..అక్కడ వేచి ఉండమని మేయర్‌ బదులిచ్చారని, అయితే తన ఫిర్యాదు తీసుకోవడానికి అక్కడ సిబ్బంది చెప్పడంతో మీడియాను ఆశ్రయించారు. కట్టుకున్న భార్యను, కన్న కొడుకును పట్టించుకోని వ్యక్తి ప్రజా ప్రతినిధిగా ఎలా పనిచేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ పదవిని తాను డబ్బులు పెట్టి కొనుక్కున్నానని తన భర్తే స్వయంగా చెప్పినట్లు ఆమె మీడియా ముందు వెల్లడించడం జీవీఎంసీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతోంది.

ముమ్మాటికీ కోర్టు ధిక్కారణే :

సీనియర్‌ న్యాయవాది సత్యనారాయణ

ఈ మొత్తం వ్యవహారంపై సీనియర్‌ న్యాయవాది పాకా సత్యనారాయణ స్పందిస్తూ.. ఇది స్పష్టంగా కోర్టు ధిక్కరణే అవుతుందని పేర్కొన్నారు. రోస్టర్‌ పాయింట్లు పాటించకుండా, అఫిడవిట్‌కు విరుద్ధంగా తమకు నచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. జీవీఎంసీ అధికారుల తీరుపై త్వరలోనే కంటెప్ట్‌ ఆఫ్‌ కోర్టు పిటిషన్‌ వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నియామకాలను రద్దు చేయాలని బాధితులు, న్యాయవాదులు డిమాండ్‌ చేస్తున్నారు.

నిబంధనల తూచ్‌

మున్సిపల్‌ నిబంధనల ప్రకారం కార్పొరేటర్ల కుటుంబ సభ్యులను స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా నియమించడానికి ఎటువంటి అవకాశం లేదు. 15వ వార్డు కార్పొరేటర్‌ భర్తకే ఆ పదవి లభించేలా చక్రం తిప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నియామకాలు గతంలో చెల్లకుండా పోయిన ఉదాహరణలు ఉన్నప్పటికీ, జీవీఎంసీలో మాత్రం అవే తప్పులను పునరావృతం చేస్తున్నారు. మరోవైపు, నగర పరిధిని 10 జోన్లకు విస్తరించినప్పటికీ, పాత పద్ధతిలోనే కేవలం 8 మంది సభ్యులను ఎంపిక చేయడం గమనార్హం. ఈ ఎంపిక ప్రక్రియలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను పాటించలేదని, మైనార్టీలకు కనీస ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ మద్దతుదారులకు సైతం మొండిచేయి చూపడంతో ఆ వర్గం వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement