రైతు సజీవ దహనం
రావికమతం: మండలంలోని కవగుంటలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ గిరిజన రైతు సజీవదహనమయ్యాడు. స్థానిక ఎస్‌ఐ రఘువర్మ, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కల్యాణం దొర(65) వ్యవసాయంతో పాటు నాటు వైద్యం చేస్తుంటాడు. ఇతని భార్య గతంలో మృతి చెందగా, ముగ్గురు కుమారులకు వివాహాలు జరిగాయి. వారంతా వేర్వేరుగా ఉంటున్నారు.భార్య మృతి చెందినప్పటి నుంచి పాకలో ఉంటూ నాటు వైద్యం చేస్తున్నాడు. రోజూ రాత్రి పెద్ద కుమారుడు ఇంటిలో భోజనం చేశాక పాక దగ్గరకు వెళ్లి నిద్రిస్తుంటాడు. సోమవారం రాత్రి కూడా పాకలోనే నిద్రించాడు. మంగళవారం తెల్లవారుజామున స్నానం కోసమని నీళ్లు మరగ బెడుతుండగా మంటలు చెలరేగి క్షణాల్లో పాక దగ్ధమైంది. కాళ్ల నొప్పులతో బాధపడుతున్న కల్యాణం దొర బయటకురాలేక మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. స్థానికులు వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో దొర పాకలో లేడని వారు భావించారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత పరిశీలించగా దొర మృతదేహం కనిపించిందని స్థానికులు తెలిపారు. అందిన సమాచారం మేరకు స్థానిక అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదు పు చేశారు. ఎస్‌ఐ రఘువర్మ సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరిలించారు. మృతుడి కుమారుడు రొబ్బా బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రఘువర్మ తెలిపారు.
పాకలో వేడినీరు కాస్తుండగా ప్రమాదం


