70 లక్షల మొక్కలు సిద్ధం
కె.కోటపాడు: ఈ ఏడాది జూన్ నాటికల్లా సామాజిక వన నర్సరీల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు 70 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వో సోమసుందరం తెలిపారు. మండలంలో రామచంద్రపురం, కొత్తూరు, సింగన్నదొరపాలెం, పొడుగుపాలెం, ఎ.కోడూరు, బత్తివానిపాలెంలలోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను, ఎన్‌టీపీసీ నిధులతో గొండుపాలెం, పైడంపేట, డి.అగ్రహారం, కె.జె.పురం, పిండ్రంగి గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా పెంచుతున్న మొక్కలను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 73 వన నర్సరీల ద్వారా సరుగుడు, ఏగిస, ఫెల్టోఫారం, ఎర్రచందనం, రావి, దేవ కాంచన, మహగణి తదితర మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ధేశించిన ధరకు రైతులకు అందించనున్నట్లు తెలిపారు. గత ఏడాది వన నర్సరీల ద్వారా 35లక్షల మొక్కలను పెంచి, రైతులకు అందించగా ఈ ఏడాది మొక్కల పెంపకాన్ని రెట్టింపు చేసినట్టు చెప్పారు. కె.కోటపాడు మండలంలో వన నర్సరీలలో పెంచుతున్న మొక్కల సంరక్షణపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రశేఖర్, డీఎం వెంకటపతిరాజు, వనసేవకుడు చిరికి గోవింద పాల్గొన్నారు.


