వైభవంగా దేవానంద స్వామీజీ ఆరాధన మహోత్సవం
● కొత్తపెంటలో వె ల్లివిరిసిన
ఆధ్యాత్మిక శోభ
● తరలివచ్చిన స్వామీజీలు,
సాధుసంత్
దేవరాపల్లి: మండలంలోని కొత్తపెంటలో సద్గురు దేవానంద సరస్వతీ మహారాజ్(రుషికేష్) 26వ పుణ్య తిథి ఆరాధన మహోత్సవాలు బుధవారం వైభవంగా జరిగాయి. కొత్తపెంటలోని స్వామీజీ ఆశ్రమంలో రెండు రోజులుగా జరుగుతున్న ఆరాధన మహోత్సవాలు ఆఖరి రోజు బుధవారం కనుల వైభవంగా సాగాయి. దేశం నలుమూలల నుంచి స్వామీజీ భక్తులు, శిష్యులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆశ్రమ పరిసరాలు స్వామీజీ నామ స్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు, శిష్యులు దేవానంద స్వామిజీ విగ్రహాన్ని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆశ్రమ పరిసరాలు ఆధ్యాత్మిక శోభ కళకళలాడాయి. ఉదయం నుంచి సుప్రభాతం, పతాకావిష్కరణ, నరగ సంకీర్తన, భగవద్గీత పారాయణ, సంకీర్తన తదితర పూజలు నిర్వహించారు.
ప్రవచనాలతో పులకించిన భక్తజనం
రుషికేష్ నుంచి పద్మనాభానంద స్వామీజీ మహరాజ్, అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు పరమాత్మనంద గిరి స్వామీజి, భీమిలి నుంచి రామకృష్ణానంద, దేవానంద ఆశ్రమం గౌరవ సలహాదారు శ్రీను సిద్ధాంతి, స్థానిక ఆశ్రమం అధ్యాత్మిక గౌరవ అధ్యక్షుడు విష్ణు దేవానంద సరస్వతీ స్వామీజీలు హాజరయ్యారు. స్వామీజీల ఆధ్యాత్మిక ప్రవచనాలతో వేలాదిగా హాజరైన భక్త జనం పులకించిపోయింది.
మాజీ డిప్యూటీ సీఎం బూడి ప్రత్యేక పూజలు
దేవానంద స్వామీజిని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బూడిని ఆశ్రమ నిర్వాహకులు, స్థానిక పెద్దలు ఘనంగా సత్కరించారు. స్వామీజీని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మీ, జెడ్పీటీసీ కర్రి సత్యం, స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు, రెడ్డి పైడంనాయుడు, మాజీ సర్పంచ్ రొంగలి శంకరరావు తదితరులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎస్‌ఐ వి.సత్యనారాయణ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
వైభవంగా దేవానంద స్వామీజీ ఆరాధన మహోత్సవం
వైభవంగా దేవానంద స్వామీజీ ఆరాధన మహోత్సవం


