ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
నర్సీపట్నం: పట్టణంలో ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సత్యనారాయణ జనరల్ స్టోర్స్ ఎరువుల దుకాణంలో ఎంట్రీ రిజిస్టర్‌లో స్టాక్ వివరాల్లో లోపాలను గుర్తించారు. 1.15 టన్నుల 20–20–0–13 ఎరువులకు సంబంధించిన 23 బ్యాగ్‌లను విక్రయించకుండా జిల్లా వ్యవసాయ అధికారి.. షాపు యజమానికి నోటీసు జారీ చేశారు. ఎరువుల వివరాలు, ధరల బోర్డు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల దుకాణాల్లో వివరాలు పక్కాగా ఉండాలని లేని పక్షంలో చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలని, స్టాక్ వివరాలు, ధరలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేదిలేదన్నారు. మండలంలో గబ్బాడ లో జరిగిన పొలంపిలుస్తోంది కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన వ్యవసాయ సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు పండిస్తున్న పంటల వివరాలను ఈ క్రాప్‌లో ఫిబ్రవరి 28లోపు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ టి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
విక్రయాలు నిలిపివేయాలంటూ జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలు


