గ్రావెల్ దందాపై విజిలెన్స్
అందలాపల్లి కొండపై అధికారుల తనిఖీలు
అడ్డగోలుగా అనుమతులు..?
అచ్యుతాపురం : మండలంలోని కొండకర్ల–అందలాపల్లి కొండను మైనింగ్ విజిలెన్స్ బృందం సోమవారం పరిశీలించింది. సర్వే నంబర్ 136/2లో ఉన్న సుమారు 38 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కొండలో పై భాగాన 4.2 హెక్టార్ల విస్తీర్ణంలో బీవీఆర్‌ఎస్ కంపెనీకి గ్రావెల్ క్వారీ నిర్వహణకు అనుమతివ్వడాన్ని తప్పుపడుతూ స్థానికులు జిల్లా కలెక్టరేట్‌లో గత నెల 29న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు, అందలాపల్లి కొండలో గ్రావెల్ దందాపై ఈ నెల 4న సాక్షిలో వచ్చిన కథనంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఫిర్యాదుదారు శివ నుంచి వివరాలు సేకరించారు. బీవీఆర్‌ఎస్ కంపెనీ ప్రతినిధితో మాట్లాడారు. కొండ వద్ద జరిగిన తవ్వకాలు, క్వారీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకూ క్వారీకి కేటాయించిన స్థలం వద్ద ఎటువంటి తవ్వకాలు జరపలేదని గుర్తించారు. క్వారీకి సంబంధం లేని స్థలంలో జరిపిన తవ్వకాల గురించి బీవీఆర్‌ఎస్ కంపెనీని అడిగి తెలుసుకున్నారు. క్వారీ ప్రాంతానికి వెళ్లేందుకు అవసరమైన ర్యాంప్ నిర్మాణానికి రోడ్డు వేసుకుంటున్నామని కంపెనీ ప్రతినిధి తెలపడంతో రోడ్డు వేసేందుకు ఎవరు అనుమతిచ్చారని స్థానికులు ఎదురు ప్రశ్నించగా కంపెనీ ప్రతినిధి సమాధానం చెప్పలేకపోయారు. రహదారి పనుల నిమిత్తం క్వారీ కేటాయిస్తే అడ్డుకోవడం తగదని పేర్కొనగా, స్థానికులు ఆయన వాదనను ఖండించారు. స్థానికుల్ని సంప్రదించకుండా ఇక్కడ ఎవరు క్వారీ కేటాయించారని, అవసరమైతే క్వారీకి కేటాయించిన స్థలం ముందు ఆందోళన చేపడతామన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు తాము వచ్చామని, ఇక్కడి వాస్తవ స్థితిగతుల్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని విజిలెన్స్ బృందంలోని రాయల్టీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. విజిలెన్స్ బృందంలో రాయల్టీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు, మైన్స్ ఇన్‌స్పెక్టర్ పైడితల్లి, వీఆర్‌ఓ రాంబాబు పాల్గొన్నారు.
అందలాపల్లి కొండపై ఇచ్చిన క్వారీ లీజు మంజూరు అడ్డగోలుగా జరిగినట్టు తెలుస్తోంది. 5 హెక్టార్ల లోపు ఉన్న క్వారీలకు గ్రామసభ ఆమోదం అవసరం లేదనే వెసులుబాటును ఉపయోగించుకొని ఈ క్వారీ కేటాయింపు స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలియకుండా చేపట్టారు. కనీసం పంచాయతీ తీర్మానం బట్టి స్థానిక తహసీల్దార్ ఇచ్చే ఎన్‌ఓసీ బట్టి మైనింగ్ అధికారులు లీజు మంజూరు ప్రక్రియ మొదలుపెట్టాలి. ప్రస్తుత ఇన్‌ఛార్జ్ తహసీల్దార్ వరహాలును ఈ విషయమై సంప్రదించగా, గతంలో ఎన్‌ఓసీ పంపించి ఉండొచ్చని, తమ వద్ద దీనికి సంబంధించిన సమాచారం లేదని తెలిపారు. ప్రస్తుత వీఆర్‌ఓ రాంబాబు సైతం ఎన్‌ఓసీ గురించి తమ వద్ద సమాచారం లేదన్నారు. అనకాపల్లి–అచ్యుతాపురం రహదారి విస్తరణకు సంబంధించి తొలి దశ పూర్తి చేసేందుకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో గ్రావెల్ అవసరమయ్యింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి గ్రావెల్ డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా లభించడం లేదు. దీంతో ఈ క్వారీని రోడ్డు విస్తరణకు ఉపయోగించాల్సి ఉందని బీవీఆర్‌ఎస్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కానీ లీజు మంజూరులో రహదారి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అంతే కాకుండా కొండ పై భాగాన గ్రావెల్ తవ్వకాలకు అనుమతిచ్చారు. కొండపైకి వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేయాల్సి వస్తే పెద్ద ఎత్తున గ్రావెల్‌ను, బండరాళ్లన పెకిలించాల్సి ఉంది. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ర్యాంప్‌కు ముఫ్పై అడుగుల మేర ఎత్తులో తవ్వకాలు జరిపినట్టు అక్కడ కనిపిస్తుంది. కొండ దిగువన ఇప్పటికే భారీ స్థాయిలో గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. ఒక ఆర్‌అండ్‌బీ జేఈ బంధువు నేరుగా రంగంలోకి దిగి కొండ దిగువ భాగాన గ్రావెల్‌ను తవ్వేసినట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా సదరు ఆర్‌అండ్‌బీ జేఈ బంధువులు స్థానిక ప్రతినిధులతో బేరసారాలు మొదలుపెట్టారు. పర్యాటక కేంద్రంగా ఉన్న కొండకర్ల ఆవకు సమీపంలోని అందలాపల్లి కొండను క్వారీ లీజుకు కేటాయించడంలో కచ్చితంగా ఈసీ క్లియరెన్స్ పారదర్శకంగా జరగాల్సి ఉంది. కొండకు సమీపంలో కొన్ని శివారు గ్రామాలు కూడా ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన మైనింగ్ అధికారులు ఎలా లీజు కేటాయించారో అర్థం కాని ప్రశ్నగా స్థానికులు చెబుతున్నారు.
గ్రావెల్ దందాపై విజిలెన్స్


