ఆర్గానిక్ కుండ బెల్లానికి మాజీ ఉపరాష్ట్రపతి కితాబు
కశింకోట : కశింకోటలో సంఘ మిత్ర ఫార్మర్ ప్రొడ్యూసర్ సొసైటీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న ఆర్గానిక్ సుగంధ ద్రవ్య కుండ బెల్లాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు రుచి చూశారు. గుంటూరులోని కొర్నిపాడులో రైతు నేస్తం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడి సొసైటీ ఆధ్వర్యంలో తయారుచేస్తున్న కుండ బెల్లం స్టాల్ ఏర్పాటు చేసి సోమవారం ప్రదర్శించినట్టు సంఘ మిత్ర చైర్మన్ శిలపరశెట్టి చిట్టెమ్మ, ఉపాధ్యక్షుడు ఆళ్ల అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనను తిలకించిన వెంకయ్యనాయుడు అనకాపల్లి ప్రాంత బెల్లం రుచిగా ఉంటుందని, ఈ బెల్లం తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారన్నారు. సొంఠి, మిరియాలు, యాలకులు, లవంగాల వంటి సుగంధ ద్రవ్యాలను కలిపి ఆరోగ్యకరమైన ఆర్గానిక్ బెల్లాన్ని గత రెండేళ్లగా తయారు చేసి ప్రజలకు విక్రయిస్తున్నామని, దీని ప్రాధాన్యంపై ప్రదర్శనలు నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామని తెలియజేశామన్నారు.


