లూయిస్ బ్రెయిలీకి ఘన నివాళులు
అనకాపల్లి: స్థానిక వేల్పులవీధి టౌన్ బాలికొన్నత హైస్కూల్‌లో విజువల్లి ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనకాపల్లి,అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు కొరుప్రోలు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 217 వ జయంతి వేడుకల జరిగాయి. అంతకుముందు బ్రెయిలీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అంధులు అందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాసీ్త్రయవాది, మేధావి అయిన లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశంలో రానా కురువే గ్రామంలో జనవరి 4, 1809లో జన్మించారని తెలిపారు. తన తండ్రితో ఒకరోజు గురప్రు జీనులు తయారు చేసుకునే పదునైన జువ్వ కత్తులతో తండ్రిని అనుకరిస్తూ ప్రమాదానికి గురై రెండు కళ్లను కోల్పోయారని తెలిపారు. బ్రెయిలీ 1821 బార్బేరియన్ పాఠశాలలో చేరి 12 చుక్కల లిపితో కొంతకాలం చదువు కొనసాగించి, దానితో సంతృప్తి చెందక అనేక పరిశోధనలు చేసి దాదాపు 11 సంవత్సరాలు పరిశోధన అనంతరం 1832లో సరళ పద్ధతిలో చుక్కల లిపిని కనుగొన్నారని చెప్పారు. అంధుడై ఉండి అంధుల కోసం ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానానికి అనుకూలంగా లిపి రూపొందించబడిందంటేనే లూయిస్ బ్రెయిలీ ముందుచూపు ఎంతో అర్థమవుతుందన్నారు. అనంతరం 25 మంది అంధ నిరుద్యోగులకు దుప్పట్లను బయ్యవరం గ్రామానికి చెందిన సిద్ధ శ్రీను, అంద దివ్యాంగులకు రిటర్న్ గిఫ్ట్‌స్‌ను, కె.ఎస్.ఎస్ జి ప్రత్యూష, విశాఖకు చెందిన కె.ఆనంద్ అంధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్, పీఆర్‌టీయు ప్రధాన కార్యదర్శి పల్లా పోతురాజు, విజువల్లి చాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పారిశెట్టి అప్పారావు, విజువల్లి చాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు ఎరుకనాయుడు, విజువల్లి చాలెంజ్డ్ యూత్ అసోసి యేషన్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు.


