ఐకమత్యంతో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి
యలమంచిలి రూరల్ : హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశంలో ప్రతి ఒక్క హిందువుపై ఉందని శ్రవణ చైతన్యానంద చిన్న స్వామీజీ అభిప్రాయపడ్డారు. ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు. మున్సిపాలిటీ పరిధి సోమలింగపాలెంలో జరిగిన హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యసించారు. ప్రపంచానికి భారతదేశం విశ్వ గురువు లాంటిదన్నారు. హిందువులంతా ఐక్యంగా ఉండాలన్నారు. నేటి తరం పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించాలన్నారు. పలువురు ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు హిందూ సమ్మేళనం ఆవశ్యకతను వివరించారు. దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తూ హైందవ ధర్మాన్ని కాపాడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు అందరూ మద్దతివ్వాలని నాయకులు పిలుపునిచ్చారు. హైందవ సమాజం ప్రతి ఒక్కరి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. దేశంలో హిందువులు, హిందూ ధర్మం, విశ్వాసాలపై జరుగుతున్న దాడులపై ఉదాసీనత పనికిరాదన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యం పనిచేస్తున్న సాంస్కృతిక కళాకారులు, భజన, కోలాట గురువులను సత్కరించారు. కార్యక్రమానికి ముందు సోమలింగపాలెం గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. చిటికెల భజనలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానికులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆంధ్ర ప్రాంత సంయోజకులు తిరుపతయ్య,రాష్ట్ర సేవికా సమితి ప్రాంత సహకార్యవాహిక లింగం ఉజ్వల,హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు ఏవీ రెడ్డి నాయుడు, సామాజిక సమరసత ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శరగడం సత్యనారాయణ, యల్లపు శ్రీను, కర్రి గంగాధర్ పాల్గొన్నారు.
శ్రవణ చైతన్యానంద చిన్న స్వామీజీ


