రంగనాథుడిగా వెంకన్న అపురూప దర్శనం
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవేంకటేశ్వరస్వామి రంగనాథుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు శయనిస్తుండగా శ్రీదేవి, భూదేవి కాళ్లు వత్తుతున్నట్లుగా అలంకరించిన రూపాన్ని చూసి భక్తులు ఆనందపరవశులయ్యారు. ఏ ఆలయంలో లేని విధంగా స్వామివారికి ఎనిమిది అలంకారాలతో, ఎనిమిది వాహనాల్లో తిరువీధి సేవలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో షడ్భుజాలతో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారికి అర్చక స్వాములు కృష్ణమాచార్యులు ఉదయం 3 గంటలకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం గుండా గరుడాద్రిపై వెలసిన మూలవిరాట్ దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు ఉపమాక తరలిరావడంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడింది. కింద బేడామండపంలో గర్భాలయంలో ఉన్న స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీవారి పోటు ముందు ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు చేసి రంగనాథునిగా అలంకరించి భక్తులకు ఉత్తర ముఖంగా దర్శనం కల్పించారు. సాయంకాలారాధనల అనంతరం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవేంకటేశ్వరస్వామిని రంగనాథునిగా అలంకరించి పుణ్యకోటి వాహనంపైన, రాజాధిరాజ వాహనంలో గోదాదేవి అమ్మవారిని, రుక్మిణీ సహిత వేణుగోపాలస్వామిని పొన్న వాహనంలోను, ఆంజనేయ వాహనంలో సీతారాములను, హంస వాహనంలో శయన పెరుమాళ్లను, లక్కగరుడ వాహనంలో చిన్నికృష్ణుని, గజవాహనంలో ప్రాకార పెరుమాళ్లను, పల్లకిలో బుల్లిరాముడిని వేంచేయింపజేసి ఉపమాక మాఢ వీధుల్లో తిరువీధి సేవలు నిర్వహించారు. ఉపమాక శ్రీనివాస భజన బృందంవారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వాహనాల ముందు కోలాటం, భజన గీతాలు ఆలపించారు. గోదాదేవికి తిరుప్పావై 13వ పాశురాన్ని విన్నపం చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, అర్చకులు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, రామగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు పూజల్లో పాల్గొన్నారు.
రంగనాథుడిగా వెంకన్న అపురూప దర్శనం


