ప్రొటోకాల్‌పై గరంగరం
మహారాణిపేట(విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రొటోకాల్ అమలుపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరు కావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్(విశాఖ), విజయ కృష్ణన్(అనకాపల్లి), దినేష్ కుమార్(ఏఎస్‌ఆర్ జిల్లా), సీఈవో నారాయణమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులకు గౌరవం లేదా?
వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులను పిలవడం లేదని, వారిని గౌరవించాల్సిన అవసరం లేదా అని సూరిబాబు(ఎంపీపీ, అనకాపల్లి), ఈర్లె అనురాధ(జెడ్‌పీటీసీ), సన్యాసి రాజు, నాగమణి, ఉమాదేవి, కర్రి సత్యం, దొండా రాంబాబు తదితరులు ప్రశ్నించారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రొటోకాల్ పక్కాగా ఉండేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తూరులో వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు ఆరోపించారు. కె.కోటపాడు జెడ్‌పీటీసీ ఈర్లె అనురాధ మాట్లాడుతూ ఇటీవల తన మండలంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆహ్వానించలేదన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర ఆదేశించారు. ప్రొటోకాల్ పాటించని ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేస్తామని సీఈవో నారాయణమూర్తి తెలిపారు.
పింఛన్ల ఏరివేత ఆపండి
ఉమ్మడి విశాఖ జిల్లాలో పింఛన్ల ఏరివేత ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని, ఈ ఏరివేతలో అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తున్నారని గొలుగొండ ఎంపీపీ నాగమణి ఆరోపించారు. బుచ్చయ్యపేట జెడ్‌పీటీసీ దొండపూడి రాంబాబు మాట్లాడుతూ అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారని, అర్హులకు తొలగిస్తున్నారని మండిపడ్డారు.
పల్లె రోడ్ల దుస్థితిపై సర్వత్రా గగ్గోలు
వడ్డాది, చోడవరం, రోలుగుంట, నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లోని గ్రామాల్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని మాడుగుల ఎంపీపీ తాళ్లపూడి వెంకట రాజారామ్ వివరించారు. ఈ మార్గా ల్లో ప్రయాణించడం గగనంగా మారిందని వాపోయారు. దేవరాపల్లి మండలంలో కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని జెడ్‌పీటీసీ సభ్యుడు కర్రి సత్యం అన్నారు. కోటవురట్ల మండలంలో కూడా రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయని జెడ్‌పీటీసీ సభ్యురాలు ఉమాదేవి తెలిపారు.
అప్పలరాజును విడుదల చేయాలి
సీపీఎం నాయకుడు అప్పలరాజుపై పెట్టిన పీడీ కేసును ఎత్తి వేయాలని పలువురు సభ్యులు కోరారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అప్పలరాజుపై పీడీ యాక్టు నమోదు చేయడం దారుణమని అనంతగిరి జెడ్‌పీటీసీ డి.గంగరాజు అన్నారు. ఆయనకు మద్దతుగా పలువురు వైఎస్సార్‌సీపీ సభ్యులు, నక్కపల్లి జెడ్పీటీసీ గోసల కుశలమ్మ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, లాలం రాంబాబు తదితరులు మాట్లాడారు. బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాలుష్యంపై ఆందోళన
పరవాడలో వివిధ పరిశ్రమల కారణంగా కాలుష్యం సమస్య అధికంగా ఉందని జెడ్‌పీటీసీ పైలా సన్యాసిరాజు అన్నారు. పలు లారీలు ఓవర్ లోడుతో వెళ్తుండడంతో రోడ్లు ఛిద్రమయ్యాయని చెప్పారు. అయినా కాలుష్య నివారణ అధికారులు, ఆర్‌టీవో, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అచ్యుతాపురంలో కూడా కాలుష్య సమస్య అధికంగా ఉందన్నారు. పలు ప్రాంతాల నుంచి మట్టి అక్రమ తరలింపుపై గనుల శాఖ అధికారులు సమాధానం చెప్పాలని మాడుగుల ఎంపీపీ తాళ్లపూడి వెంకట రాజారామ్ డిమాండ్ చేశారు.
యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని నియోజకవర్గ జెడ్పీటీసీలు లాలం రాము, ధూళి నాగరాజు, శానాపతి సంధ్య, కో–జెడ్పీటీసీ నర్మాల కుమార్ కోరారు. తొలుత మునగపాక జెడ్‌పీటీసీ పెంటకోట సోము సత్యనారాయణ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉన్నందున కొత్త సబ్–డివిజన్ యలమంచిలికి మార్చాలన్నారు. లేకుంటే అనకాపల్లిలోనే రెవెన్యూ డివిజన్ కొససాగించాలన్నారు. అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త సబ్–డివిజన్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.
ప్రొటోకాల్ అమలుపై జెడ్పీ చైర్‌పర్సన్ సుభ్రద, కలెక్టర్ల ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు
మండలాల్లో అభివృద్ధి పనులకు ఆహ్వానం లేకపోవడంపై జెడ్పీటీసీల ఆగ్రహం
బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా నినాదాలు
వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం
ఎమ్మెల్యేలు, ఎంపీల గైర్హాజరుపై
గుసగుసలు


