ముక్కోటి వైభవం
ముక్కోటి ఏకాదశి పర్వదినాన సింహగిరి భూవైకుంఠాన్ని తలపించింది. సింహాచలం గోవింద నామస్మరణతో మార్మోగింది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వైకుంఠవాసుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆ దివ్య మంగళ రూపాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి ‘గోవిందా.. గోవిందా’ అంటూ తన్మయత్వంతో పరవశించిపోయింది. ‘ఏ జన్మ పుణ్యమో ఈ అపురూప దర్శనం’ అంటూ భక్తులు ఆనందబాష్పాలతో అప్పన్న స్వామిని అర్చించారు.
● వైకుంఠవాసుడిగా సింహాద్రినాథుడు
● కనులపండువగా అప్పన్న ఉత్తరద్వార దర్శనం ● పరవశించిన భక్తజనం
సింహాచలం: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఉత్తరద్వార దర్శనం కనులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడై శేషతల్పంపై కొలువుదీరిన స్వామి వారు, ఉత్తర రాజగోపురం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఏడాదిలో ఒక్క రోజు, అది కూడా కేవలం కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శన భాగ్యాన్ని పొంది భక్తులు పులకించిపోయారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే వైదికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. ఉత్సవమూర్తి అయిన గోవిందరాజ స్వామిని వైకుంఠవాసుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను మేలిముసుగులో ఉంచి శేషతల్పంపై అధిష్టింపజేసి ఆలయ బేడా మండపంలో తిరువీధి నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం.. తొలుత ఆలయ ఉత్తరద్వారం వద్ద స్వామిని ఉంచి, మేలిముసుగు తొలగించారు. సంప్రదాయం ప్రకారం పూసపాటి వంశీయులకు తొలి దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామిని ఉత్తర రాజగోపురంలో ఏర్పాటుచేసిన వేదికపైకి చేర్చారు. ఉదయం 5.10 గంటల నుంచి 11.15 గంటల వరకు భక్తులకు దర్శనాన్ని అందజేశారు. ఆ తర్వాత సింహగిరి మాడవీధిలో స్వామివారి తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు సాతులూరి నరసింహాచార్యులు తదితరులు పూజల్లో పాల్గొన్నారు.
గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు
వడ్డాది వేంకటేశ్వరస్వామి
ముక్కోటి వైభవం


