ఈ ఏడాది 5,821 కేసులు
సాక్షి, అనకాపల్లి: ఈ ఏడాదిలో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఆస్తి తగాదాలు, సోషల్ మీడియా వేధింపులు గణనీయంగా పెరిగాయి. గతేడాది 61 సైబర్ నేరాలు నమోదు కాగా.. ఈ ఏడాది 76 కేసులకు చేరాయి. సోషల్ మీడియా వేధింపుల కేసులు కూడా గతేడాది 19 కాగా.. ఈ ఏడాది 21 నమోదయ్యాయి. ఆస్తి సంబంధిత, ఆర్థిక నేరాలు గతేడాది 406 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 417 కేసులకు పెరిగాయి. మోసపూరిత కేసులు గతేడాది 131 కాగా.. ఈ ఏడాదిలో 125 నమోదయ్యాయి. నమ్మకద్రోహం కేసులు గతేడాది 18 కాగా.. ఈ ఏడాది 17 కేసులు నమోదయ్యాయి. మంగళవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ‘జిల్లా వార్షిక నేర నివేదిక–2025’ నేరాల గణాంకాలను, పోలీస్ శాఖ సాధించిన పురోగతిని ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. మొత్తంగా గతేడాది 2024లో 7,573 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 5,821 కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు.
1880 మొబైల్ ఫోన్ల రికవరీ
ఈ ఏడాదిలో జరిగిన మూడు మేళాల ద్వారా రూ.3.7 కోట్ల విలువైన 1,880 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామని ఎస్పీ తెలిపారు. 128 మాదకద్రవ్యాల(ఎన్‌డీపీఎస్) కేసులు, 3,627 ఇతర సాధారణ కేసులు నమోదైనట్టు చెప్పారు. 128 గంజాయి కేసుల్లో 411 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.4.41 కోట్ల విలువైన 8790.88 కిలోల గంజాయిని, 7.39 లీటర్ల హషీష్ ఆయిల్, 115 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆయా కేసుల్లో ఆరుగురు గంజాయి నిందితులపై కేసులు పిట్ ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేశామన్నారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆరుగురు వ్యక్తుల ఆస్తులు రూ.1,25,22,100ను ఫ్రీజ్ చేశామన్నారు. 312 మంది గంజాయి నేరస్తులపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసినట్టు ఎస్పీ వివరించారు. లోక్ అదాలత్ ద్వారా 16,132 కేసులను పరిష్కరించామన్నారు. గంజాయి అక్రమ రవాణా, హత్య, పోక్సో కేసుల్లో 51 శాతం.. ఒక కేసులో మరణశిక్ష, 2 కేసుల్లో జీవిత ఖైదు, మరో 2 కేసుల్లో నిందితులకు 20 ఏళ్లు జైలు శిక్ష, 10 కేసుల్లో పదేళ్ల జైలు శిక్ష, 5 కేసుల్లో ఐదేళ్లు కంటే ఎక్కువగా జైలు శిక్షలు నిందితులకు విధించేలా చార్జ్‌షీట్ దాఖలు చేశామన్నారు.
నేర శోధనలో సాంకేతిక సాయం
నేర పరిశోధనలో భాగంగా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద దహనం చేసిన మహిళా మృతదేహాన్ని గుర్తించి, 450 సీసీ కెమెరాల ఫుటేజీల ద్వా రా నిందితులను(మృతురాలి అల్లుడు, తదితరులు) 11 రోజుల్లోనే అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. కశింకోటలో ట్రాన్స్‌జెండర్ హత్య కేసులో నిందితుడిని కాల్ డేటా, టవర్ లోకేషన్ ఆధారంగా 24 గంటల్లోనే గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. జిల్లాలో కొత్తగా 3,573 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. సాంకేతికత సహాయంతో 41 కేసులు, వేలిముద్రల (ఏఎఫ్‌ఐఎస్) ద్వారా 58 కేసులు ఛేదించినట్టు చెప్పారు.
11 హత్యలు.. 291 వేధింపులు
ఈ ఏడాదిలో 11 హత్యలు జరిగాయి. మహిళలపై వేధింపు కేసులు 291, మిస్సింగ్ కేసులు 316 నమోదయ్యాయి. పోక్సో కేసులు, తీవ్రమైన నేరాలు, ప్రాణహాని కలిగించే నేరాలు 417 నమోదయ్యాయి. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్‌రావు, డీఎస్పీలు జీఆర్‌ఆర్ మోహన్, ఈ.శ్రీనివాసులు, బి.మోహనరావు, ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, పరిపాలన అధికారి తిలక్‌బాబు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


