
కూటమి హయాంలో కుంటుపడిన పంచాయతీల అభివృద్ధి
15వ ఆర్దిక సంఘ నిధులు రాక
అభివృద్ధికి నోచుకోని పంచాయతీలు
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ స్పందించాలంటున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు
మునగపాక: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీల అభివృద్ధి కుంటుపడిందని మండల సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి సుందరపు నీలకంఠస్వామి (తాతాజీ) ఆరోపించారు. శుక్రవారం మునగపాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలకు విడుదలైన నిధులను ప్రభుత్వం వేరే పనులకు బదలాయించడం వల్ల పంచాయతీలు అభివృద్ధికి నోచుకోవడంలేదన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 2099 కోట్ల 15వ ఆర్థిక సంఘ నిధులను రాష్ట్రానికి విడుదల చేసినట్టు చెప్పారు. వాటిని వేరే అవసరాలకు బదలాయించడం విచారకరమన్నారు. రాష్ట్రానికి సంబంధించి 2025–26 సంవత్సరానికి 1,000 కోట్ల మేర నిధులు విడుదల కావాల్సి ఉన్నా ఇంతవరకు రూపాయి విడుదల చేయలేదని తెలిపారు. సర్పంచ్‌లకు గత 8 నెలలుగా గౌరవ వేతనం కూడా విడుదల చేయలేదన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేసి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సర్పంచ్‌లు ఆడారి త్రిమూర్తులు,బొడ్డేడ శ్రీనివాసరావు,కర్రి పెదబ్బాయి,ఎంపీటీసీలు మద్దాల వీరునాయుడు,మళ్ల కాశీ సురేష్, తిమ్మరాజుపేట ఉప సర్పంచ్ కాండ్రేగుల జగన్ తదితరులు పాల్గొన్నారు.