
పోలీసులపై మండిపడుతున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
మేమొస్తుంటే సీఐ, ఎస్‌ఐ ఏం చేస్తున్నారు?
నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చిపోయిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు
అయ్యన్న తిట్లు విని అనుచర వర్గం కేకలు.. చిన్నబుచ్చుకున్న పోలీసు అధికారులు
విధి నిర్వహణలోనే ఉన్నా ఈ తిట్లేంటని ఆవేదన
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం విప్పారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడిలో ప్రొటోకాల్ తెలియదా అంటూ పోలీసులను ఉద్దేశించి రెచ్చిపోయారు. నేను వస్తున్నానంటే కూడా మీకు లెక్కలేదా అంటూ బూతులు లంకించుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
రావికమతం: అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం విప్పారు. మేమొస్తుంటే మీరేం చేస్తున్నారంటూ పోలీసులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ప్రొటోకాల్ తెలియదా అంటూ పోలీసులను ఉద్దేశించి పత్రికల్లో రాయలేని భాషలో విరుచుకుపడ్డారు. అయ్యన్న రెచ్చిపోయిన తీరుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడిలో ఈ నెల 21న గ్రామ దేవత శ్రీదుర్గాలమ్మ పండుగ భారీ ఎత్తున జరిగింది. నిర్వాహకుల ఆహ్వానం మేరకు వివిధ ప్రాంతాల నుంచి .. వివిధ పార్టీలకు చెందిన దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. వేలాది మంది భక్తుల రాకతో గ్రామంలో విపరీతమైన రద్దీ నెలకొనడంతో సీఐ, ఎస్‌ఐ సహా పోలీసులంతా బందోబస్తులో నిమగ్నమయ్యారు.
అదే సమయంలో అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున అనుచరులను వెంట బెట్టుకుని అయ్యన్న వచ్చారు. వచ్చీ రాగానే.. పోలీసులెక్కడ.. అని ప్రశ్నిస్తూ నోటికి పని చెప్పారు. పోలీసు అధికారులెవరూ తన వద్దకు రాలేదని ఆగ్రహించారు. ‘మేమొస్తుంటే సీఐ, ఎస్‌ఐ ఏం చేస్తున్నారు? తమాషాలు చేస్తున్నారా?.. నేను వచ్చినా కూడా ఇక్కడకు రారా..’ అంటూ బండబూతులతో రెచ్చిపోయారు.
అయ్యన్న పోలీసులను తిడుతుంటే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున మద్దతుగా కేకలు వేశారు. ఆ పక్కనే ఉన్న పోలీసులు అక్కడికి వచ్చి.. ‘సార్.. మేమిక్కడే ఉన్నామని చెబుతున్నా ఆయన వినిపించుకోలేదు. దీంతో పోలీసులు చిన్నబుచ్చుకున్నారు.