
దండం పెడతాం.. పాఠశాల భవనం నిర్మించండి
రోలుగుంట: శిథిల స్థితిలో ఉన్న తమ పాఠశాల భవనాన్ని తొలగించి పునర్నిర్మించాలంటూ శుక్రవారం ఎం.కె.ట్నం పంచాయతీ శివారు గిరిజన గ్రామం పెదపేట పాఠశాల విద్యార్థులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో దండం పెడుతూ వినూత్న నిరసన తెలిపారు. ఈ నిరసనకు సారథ్యం వహించిన కె.చిరంజీవి మాట్లాడుతూ ఈ పాఠశాలలో పెదపేట, ఎం.పెడపేట గ్రామాల విద్యార్థులు మొత్తం 22 మందికి విద్యా బోధన సాగుతుందన్నారు. ఈ పాఠశాల భవన నిర్మాణం జరిగి సుమారుగా 40 సంవత్సరాలు దాటిందని, ఇప్పుడు ఈ శిథిల స్థితికి చేరుకోవడంతో ఆందోళన కలుగుతోందన్నారు. పాఠశాల పైకప్పు దెబ్బ తిని వర్షాలకు కారిపోతోందన్నారు. పెచ్చులు ఊడి పడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారులు స్పందించి భవనం పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు.

దండం పెడతాం.. పాఠశాల భవనం నిర్మించండి