
మృతుల పేరిట ఉపాధి వేతనాల చెల్లింపు
● బుచ్చెయ్యపేట మండలంలో విడ్డూరం
● సోషల్ ఆడిట్‌లో బట్టబయలు
బుచ్చెయ్యపేట: మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో లక్షలాది రూపాయల అవినీతి జరిగినట్టు సోషల్ ఆడిట్‌లో తేలింది. గురువారం బుచ్చెయ్యపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన సామాజిక తనిఖీ ప్రజా వేదికలో ఈ వ్యవహారం బయట పడింది. పలు గ్రామాల్లో ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టినట్లు సోషల్ ఆడిట్ సిబ్బంది వివరించారు. రాజాం గ్రామంలో మృతి చెందిన యాదగిరి మాణిక్యం 36 రోజులు ఉపాధి పనులు చేయగా రూ, 10,800, మోటూరి రవిబాబు 8 రోజులు పని చేయగా రూ, 2,400 పేమెంట్లు చేసినట్లు గుర్తించామని సోషల్ ఆడిట్ సిబ్బంది వెల్లడించారు. ఆర్.శివరాంపురంలో బోయిన భూలక్ష్మి పనికి వెళ్లకపోయినా ఆమె పేరు మీద రూ,15,600 నగదు డ్రా చేశారు. గంటికొర్లాంలో వీఆర్పీ ఉపాధి పనులకు వెళ్తున్నట్లు మస్టర్లు వేయడమే కాక ఆమె భర్త పేరు మీద గ్రామంలో మొక్కలకు వాటరింగ్ చేసినట్లు రూ. 42 వేలు డ్రా చేశారన్నారు. గ్రామంలో 400 మొక్కలు నాటినట్లు రికార్డులు చూపగా.. సోషల్ ఆడిట్‌లో 174 మొక్కలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. గంటికొర్లాం వీఆర్పీ గతంలో జరిగిన మూడు, నాలుగు సోషల్ ఆడిట్‌లో లక్ష రూపాయల వరకు నిధులు పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. పలు గ్రామాల్లో తవ్వించిన ఫారం పాండ్స్ కొలతల్లో తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు సోషల్ ఆడిట్‌ను అధికారులు నిర్వహించారు. డ్వామా పీడీ పూర్ణిమాదేవి, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర, ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీవో భానోజీరావు, ఏపీవో వరహాలుబాబు, ఎంపీపీ డి.నాగేశ్వరిదేవి, జెడ్పీటీసీ దొండా రాంబాబు, వైస్ ఎంపీపీ దొండా లలితా నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.