
దోమలను పారదోలుదాం
అనకాపల్లి: వర్షాలు పడుతున్న కారణంగా ప్రజలు దోమలు బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో ఎం.హైమావతి అన్నారు. ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక భీమునిగుమ్మం హైస్కూల్ రహదారిలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనాఫిలస్ ఆడ దోమ ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని సర్ రోనాల్డ్ రాస్ చెప్పినట్లు ఆమె తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ఉమ్మడి భాగస్వామ్యంతో ఉద్యమిద్దామన్నారు. వారంపైబడిన నీటి నిల్వలు తొలగించాలని, దోమల పెరుగుదలను నివారించి ఆరోగ్యంగా జీవించేందుకు ప్రతి వ్యక్తి కృషి చేయాలని అన్నారు. నిద్రించేటప్పుడు దోమతెరలు తప్పకుండా వాడాలని, ఇంటి కిటికీలు, తలుపులకు దోమలు రాకుండా మెష్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి కె.వరహాలుదొర, జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.