
25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పిజిఆర్‌ఎస్ అర్జీలు, అందరికీ ఇళ్లు, భూముల క్రమబద్ధీకరణ, భూ సర్వే , కోర్టు కేసులు, అన్నదాత సుఖీభవ, రేషన్ పంపిణీ, మ్యుటేషన్లు, ఏపీ సేవా సర్వీసులు, నీటితీరువా వసూళ్లు, ఇంటి స్థల దరఖాస్తుల పరిశీలన, తదితర అంశాలపై జేసీ జాహ్నవి, డీఆర్వో సత్యనారాయణరావుతో కలిసి కలెక్టరేట్ మినీ కన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఇంటి స్థలం కోసం వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల వివరాలు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. వివాదం లేని ఆక్రమిత ప్రభుత్వ భూములలో ఇంటి నిర్మాణం చేసి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారుల వివరాలను పరిశీలించి వెంటనే ముగించాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ కోసం ఇంకా ఏమైనా దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే దానికి గల కారణం పరిశీలించి ఆధార్ సీడింగ్ వంటి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి తీరువా వసూళ్లు ఆగస్టు నాటికి పూర్తిచేయాలని చెప్పారు.
బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు
బాల్య దశలో వివాహాలు జరగకుండా, కౌమార దశలో గర్భం దాల్చకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాసంతపు జిల్లా స్థాయి బాలల సంక్షేమ, రక్షణ కమిటీ సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలో అన్ని మండల, గ్రామ, వార్డు పరిధిలో బాలల సంక్షేమ, రక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. బాలలు మత్తు మందులకు బానిస కాకుండా, వారికి స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల అధికారి కె.ఎల్.ఎన్.మూర్తి, బాలల సంరక్షణ అధికారి రమేష్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీఎంహెచ్‌వో హైమావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.