
అదనపు వసూళ్లు, ఒత్తిళ్లు భరించలేం
మద్యం దుకాణాలు బంద్ చేసిన నిర్వాహకులు
ఎస్.రాయవరం: రూ.లక్షల ఖర్చు చేసి ఏర్పాటు చేసుకున్న లైసెన్స్ మద్యం దుకాణాలపై అదనపు వసూళ్లు, అధికారులు ఒత్తిళ్లు పెరిగిపోయాయని మండలంలో ఉన్న ఏడు మద్యం దుకాణాలకు తాళాలు వేసి బుధవారం బంద్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీలో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి దుకాణాలు పెట్టుకుంటే ప్రభుత్వం ఇస్తానన్న 20 శాతం కమీషన్‌లో కోత విధించి, మొదటి 5 శాతం 6 నెలలు గడిచాక 13 శాతం ఇస్తున్నారన్నారు. ఇప్పుడు కొత్తగా దుకాణాలు వద్ద మద్యం సేవించేందుకు సిట్టింగ్ పర్మిట్ రూమ్ అంటూ చలానాలు కట్టమంటున్నారన్నారు. అవి ఏర్పాటు చేసుకున్న వారు కడదామనుకుంటే సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటు చేసుకున్నా లేకున్నా చలానా నగదు కట్టాలని అధికారులు ఒత్తిళ్లు చేసి, షాపు ముందు మద్యం సేవించే వారిపైనా, అమ్మిన వారిపైన అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఇప్పటికే రూ.లక్షల్లో నష్టాలు భరిస్తున్న తమను ఇంకా వేధిస్తున్నారన్నారు. ఈ క్రమంలో తాము దుకాణాలు తెరవలేమని బంద్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ అధికారు తమ ఇబ్బందులు పరిగణనలోనికి తీసుకుని న్యాయం చేసే వరకు దుకాణాలు తెరవబోవమని చెప్పారు. ఈ ఆందోళనలో గుర్రం నానాజీ, కోయలాడ కమల్, రామకృష్ణ, దొరాజీ తదితరులు పాల్గొన్నారు.