
అశ్లీల నృత్యాల నిర్వాహకులపై కేసు నమోదు
ఏటికొప్పాకలో అశ్లీల నృత్యాల నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇస్తున్న సీఐ ధనుంజయరావు
యలమంచిలి రూరల్ : యలమంచిలి మండలం ఏటికొప్పాకలో శ్రీకృష్ణాష్టమి వేడుకల ముసుగులో అశ్లీల నృత్యాల నిర్వాహకులపై యలమంచిలి రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.ఈ నెల 17వ తేదీ రాత్రి గ్రామంలో శ్రీకృష్ణుని గుడి వద్ద ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు చేసిన నిర్వాహకులు ముగ్గురు యువతులతో అశ్లీల నృత్యాలు వేయించారు. పొట్టి దుస్తులతో అసభ్యకరంగా డాన్సులు చేశారు. ఈ వ్యవహారంపై మంగళవారం పత్రికల్లో వార్తలు రావడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యలమంచిలి రూరల్ పోలీసులు అసభ్యకర నృత్యాల నిర్వాహకులను గుర్తించారు. గ్రామ వీఆర్వో బసనబోయిన జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, వాటి ముసుగులో అసభ్యకర నృత్యాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ ధనుంజయరావు హెచ్చరించారు. ఏటికొప్పాకలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించిన యువకులకు ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు.