
సమష్టి కృషితో ఎన్‌ఎస్టీఎల్ అద్భుతాలు
గోపాలపట్నం (విశాఖ): శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, విద్యాసంస్థలు, నేవీ అధికారుల సమష్టి కృషితో ఎన్‌ఎస్టీఎల్ అద్భుతాలను సృష్టిస్తోందని డీడీ ఆర్ అండ్ డీ కార్యదర్శి, డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి.కామత్ అన్నారు. మంగళవారం ఎన్‌ఎస్టీఎల్ 56వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశాన్ని రక్షణ రంగంలో సాధికారత వైపు నడిపించడంలో ఎన్‌ఎస్టీఎల్ 56 ఏళ్ల ప్రయాణం ఎంతో కీలకమన్నారు. ఈ ప్రయాణంలో కృషి చేసిన ఉద్యోగులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌ఎస్టీఎల్ డైరెక్టర్ అబ్రహం వర్గీస్ మాట్లాడుతూ 1969 ఆగస్టు 20న కేవలం 10 మందితో ప్రారంభమైన ఎన్‌ఎస్టీఎల్.. అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు 184 మంది శాస్త్రవేత్తలు, 662 మంది ఉద్యోగులు సేవలందిస్తోందన్నారు. జలాంతర యుద్ధ ఆయుధాలు, వ్యవస్థల అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోందన్నారు. డీఆర్‌డీవో డైరెక్టర్ జనరల్(మెటీరియల్స్ అండ్ సిస్టమ్స్) ఆర్.వి.హరప్రసాద్, మెటీరియల్ అసిస్టెంట్ చీఫ్(డాక్ యార్డ్ అండ్ రిఫిట్) రియర్ అడ్మిరల్ అరవింద్ రావల్ కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులు, సిబ్బందిని సత్కరించారు. ఉత్తమ గ్రంథాలయ వినియోగదారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే మొత్తం 40 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. వరుణాస్త్ర కోసం రూపొందించిన ‘బెలూన్ రికవరీ సిస్టమ్’ సాంకేతికతను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ(బీడీఎల్)కు బదిలీ చేశారు. డాక్టర్ సమీర్ వి.కామత్ చేతుల మీదుగా ఈ సాంకేతికతను బీడీఎల్ డైరెక్టర్(ప్రాజెక్ట్స్) పి.వి.రాజారామ్‌కు అందజేశారు. ఎన్‌ఎస్టీఎల్ అభివృద్ధి చేసిన జీటీ–ఐఆర్‌ఎస్‌ఎస్‌ను ఆయన రియర్ అడ్మిరల్ అరవింద్ రావల్‌కు అందించారు. స్వదేశీ రాడార్ క్రాస్ సెక్షన్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్ ‘నిర్వాణ’ను కూడా విడుదల చేశారు. ఎన్‌ఎస్టీఎల్ హిందీ మ్యాగజైన్ ‘మథన్’8వ సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, నిర్వహణ కమిటీ సభ్యులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.