
గొలుసు కట్టు చెరువులు కాపాడుకోవాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న
కలెక్టర్ విజయకృష్ణన్
తుమ్మపాల : గొలుసుకట్టు చెరువులను కాపాడుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గొలుసు కట్టు చెరువులు దెబ్బతింటే నీరు వృథా అవుతుందని, వీటి నిర్మాణాలు పటిష్టంగా, సక్రమంగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి సోమవారం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ, తాగునీటి సమస్యలు, జల్‌జీవన్‌మిషన్ పనులు, క్యాటిల్ షెడ్లు, షేడ్ నెట్లు, సోక్ పిట్స్, గొలుసుకట్టు చెరువులు తదితర అంశాలపై సమీక్షించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య డ్రైవ్‌ను నిర్వహించాలన్నారు. బావులు, కుళాయిలు, బోర్ల వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటికి చెత్త సేకరణ సజావుగా జరగాలన్నారు. గ్రామాల్లో ఆస్తి పన్నుల వసూలుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి పంచాయతీలోనూ 20 సోక్ పిట్స్‌ను నిర్మించాలని, తద్వారా నీటి నిల్వలు వృద్ధి చెందుతాయన్నారు. షెడ్ నెట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. పశువుల షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని, క్రాప్ మిత్రలకు జీతాలు చెల్లించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, జిల్లా పంచాయతీ అధికారి సందీప్ , డిప్యూటీ సీఈవ, జిఎస్‌డబ్ల్యూఎస్ అధికారి మంజులవాణి, డ్వామా పీడీ పూర్ణిమాదేవి పాల్గొన్నారు.