వరద గుప్పెట్లో... | - | Sakshi
Sakshi News home page

వరద గుప్పెట్లో...

Aug 19 2025 4:48 AM | Updated on Aug 19 2025 4:48 AM

వరద గ

వరద గుప్పెట్లో...

ప్రమాదస్థాయికి రిజర్వాయర్లు

బుచ్చెయ్యపేట : వడ్డాదిలో పూర్తిగా మునిగిపోయిన డైవర్షన్‌ రోడ్డు

రోలుగుంట : బండారువీధిలో ఇళ్లలోకి వర్షపు నీరు

సాక్షి, అనకాపల్లి :

విశాఖపట్నం సమీపంలో ఏర్పడిన అల్పపీడనం.. జిల్లాపై విరుచుకుపడుతోంది. మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సోమవారం రాత్రికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఈదురు గాలులతో వర్షం కొనసాగే అవకాశాలున్నాయని విశాఖ తుపాన్‌ హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు. జిల్లా యంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడమేనన్నది స్పష్టమవుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందుస్తు హెచ్చరికలు జారీ చేయలేదు. దీని ఫలితంగా.. జిల్లాలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

రోడ్లపైకి వరదనీరు...

మాడుగుల మండలం శంకరం పంచాయతీలో 7 గిరిజన గ్రామాలు జల దిగ్బంధంలో నిలిచిపోయాయి. నిత్యవసర సరుకులు కూడా తెచ్చుకోలేని విధంగా ఆ గిరిజన గ్రామాల చుట్టూ ఉరకగెడ్డ చుట్టముట్టింది. భీమునిపట్నం–వడ్డాది–నర్సీపట్నం(బీఎన్‌ ) ప్రధాన రోడ్డులో వడ్దాది వద్ద పెద్దేరు నదిపై ఉన్న డైవర్షన్‌ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. విజయరామరాజుపేటలో తాచేరు నదిపై ఉన్న డైవర్షన్‌ రోడ్డు నీటి ఉధృతికి కోతకు గురై పూర్తిగా నీటిలో మునిగిపోయి దెబ్బతింది. వడ్డాది పెద్దేరు నదిపై శిథిల వంతెనను ఆనుకుని వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. వీటి కారణంగా విశాఖ నుంచి వడ్డాది మీదుగా పాడేరు వెళ్లే బస్సులు, వడ్డాది నుంచి చోడవరం మీదుగా అనకాపల్లి వెళ్లే బస్సులు, నర్సీపట్నం వెళ్లే బస్సులతో పాటు ఇతర వాహన రాకపోకలు స్తంభించాయి. వాహనచోదకులు పలు ఇక్కట్లుకు గురయ్యారు.

నీట మునిగిన పంటపొలాలు..

నాతవరం మండలంలో 14 పంచాయతీలు పరిధిలో ప్రవహిస్తున్న ఏలేరు కాలువ వర్షపు నీటితో పొంగిప్రవహించడంతో కాలువకు ఇరువైపులా ఉన్న పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఖరీఫ్‌కు సిద్ధమైన వరి మడులతో పాటు తర పంటలు నీట మునిగాయి. జలాశయాలు పెద్దేరు, తాందవ, కళ్యాణపులోవ, కోనాం, రైవాడ ఎగువ నుంచి వచ్చే వర్షపు నీరుతో ప్రమాదకరంగా మారాయి. వర్షపు నీరుతో తాండవ, వరాహనది, తాచేరు, పెద్దేరు, శారదనది, పాలగెడ్డ, చింతగెడ్డ, నీటి ప్రవహం వల్ల పంట పోలాలు మీద నీరు పొంగి ప్రవహిస్తున్నాయి.

చెరువుల్లా రహదారులు...రాకపోకలకు అగచాట్లు

మాడుగుల మండలంలో కె.జె.పురం నుంచి ప్రధాన కూడలికి వెళ్లే రహదారి మీద నుంచి వర్షపు నీరు పొంగి ప్రవహిస్తుంది. కె.జె.పురం గ్రామం మీదుగా నడుస్తున్న ఆర్టీసీ బస్సు సర్వీసులు వర్షాలకు విజయరామరాజుపేట వద్ద బొడ్డేరు నది మీద కాజ్‌వే కొట్టుకోని పోవడంతో పాడేరు, మాడుగుల నుంచి విశాఖ, అనకాపల్లి, వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులు కె.జె.పురం మీదుగా నడుపుతున్నారు. విశాఖ డిపోకు చెందిన విశాఖ–పాడేరు, అనకాపల్లి నుంచి పాడేరు ఏక్సప్రెస్‌ బస్సులును కె.జె.పురం గ్రామం మీదుగా నడుపుతున్నారు. మెట్రో ఏక్సప్రెస్‌లు ఈ రహదారిలో నిలుపుదల చేశారు. కాగా పల్లె వెలుగు బస్సులు పూర్తి స్థాయిలో నడపకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కోతకు గురైన పేట డైవర్షన్‌ రోడ్డు

బుచ్చియ్యపేట మండలంలో భీమునిపట్నం–వడ్డాది–నర్సీపట్నం(బిఎన్‌) ప్రధాన రోడ్డులో వడ్దాది వద్ద పెద్దేరు నదిపై ఉన్న డైవర్షన్‌ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. విజయరామరాజుపేటలో తాచేరు నదిపై ఉన్న డైవర్షన్‌ రోడ్డు నీటి ఉధృతికి కోతకు గురై పూర్తిగా నీటిలో మునిగిపోయి దెబ్బతింది.

వడ్డాది పెద్దేరు నదిపై శిథిల వంతెనను ఆనుకుని వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీని కారణంగా విశాఖ నుంచి వడ్డాది మీదుగా పాడేరు వెళ్లే బస్సులు, వడ్డాది నుంచి చోడవరం మీదుగా అనకాపల్లి వెళ్లే బస్సులు, నర్సీపట్నం వెళ్లే బస్సులతో పాటు ఇతర వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ముంచెత్తిన పెద్దేరు

మాడుగుల మండలంలో పెద్దేరునది సత్యవరం వద్ద కోతకు గురైంది. ఇప్పటికే పొలం పెద్దేరులో కలసి పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెద్దేరు పొంగినపుడల్లా తమ పొలం పెద్దేరులో కలిసి పోతుంటూ వాపోతున్నారు. ఇరిగేషన్‌ అధికారులు స్పందించి రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని బాదిత రైతులు కోరుతున్నారు.

జిల్లాలో వర్షపాతం ఇలా..

గడిచిన రెండు రోజుల్లో అనకాపల్లి జిల్లాలోని సగటు 113.9 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కె.కోటపాడు 180.7 మి.మీ, దేవరాపల్లి 173, మాడుగుల 166.5మిమీ, చీడికాడ 157.5 మిమీ, చోడవరం 149 మి.మీ, రావికమతం 142.8మి.మీ, సబ్బవరం 136.9 మిమీ,రోలుగుంట 131.2, అనకాపల్లి 129.0 మి.మీ, బుచ్చియ్యపేట 127.0మి.మీ, పరవాడ 115.8మి.మీ,నర్సీపట్నం 109.1 మి.మీ, యలమంచిలి 105.7 మి.మీ, అచ్యుతాపురం 101.2 మి.మీ, , మాకవరపాలెం 90.1 మి.మీ, మునగపాక 103.2 మి.మీ, పాయకరావుపేట 76.8 మి.మీ, కశింకోట 100.1 మి.మీ, గొలుగొండ 94.8 మిమీ, కోటవురట్ల 76.7 మిమీ, నాతవరం 70.7 మిమీ, రాంబిల్లి 66.9 మి.మీ, ఎస్‌.రాయవరం 67.1 మి.మీ, నక్కపల్లి 64.5 మి.మీ వర్షపాతం నమోదైంది.

బుచ్చెయ్యపేట : లూలూరులో నీట మునిగిన వరి పొలాలు

మాడుగుల : సత్యవరం వద్ద పొంగి ప్రవహిస్తున్న పెద్దేరు

జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు

నీట మునిగిన పంట పొలాలు

రోడ్లపై వరద ప్రవాహం..వాహన చోదకుల ఇక్కట్లు

ప్రమాదస్థాయికి చేరుకున్న రిజర్వాయర్లు

పొగిపొర్లుతున్న తాండవ, తాచేరు, పాలగెడ్డ, శారదానదులు

మొద్దునిద్ర వీడని యంత్రాంగం

ముందస్తు సహాయక చర్యలపై తీవ్ర నిర్లక్ష్యం

వరాహనది ఉగ్రరూపం

కోటవురట్ల: నాలుగు రోజులుగా ఎగువ ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు వరాహనది వరదనీటితో పోటెత్తింది. పాతరోడ్డు సమీపంలోని వరాహనదిలోకి సర్పానది కూడా కలియడంతో పందూరు వద్ద వరదనీటి ఉదృతి ఎక్కువగా ఉంది. దాంతో పందూరుకు రామచంద్రపురం జంక్షన్‌ నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డురోడ్డు వెళ్లేందుకు చుట్టూ 6 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. కాగా వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున నదిని దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తాండవ రిజర్వాయర్‌ గరిష్ట నీటి మట్టం 380 అడుగులు కాగా..ప్రస్తుతం నీటిమట్టం 375.2 అడుగులు ఉంది. వర్షాలు కురుస్తున్నందున ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో నీరు తాండవ ప్రాజెక్టులోకి 1200 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. తాండవ ప్రాజక్టు నుంచి ప్రధాన గేట్లు ద్వారా పంట కాలువలోకి రోజుకు 310 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. పెద్దేరు జలాశయంలో ప్రమాదస్థాయికి నీటిమట్టం చేరుకుంది. గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా..136.8 మీటర్లకు నీటిమట్టం చేరింది. దీంతో 770 క్యూసెక్కులు నీరు విడుదల చేశారు.

చీడికాడ మండలంలో కోనాం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 101.25 మీటర్లు కాగా.. ప్రస్తుతం 99.80 మీటర్లకు చేరింది. వర్షాల కారణంగా 800 క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలేశారు. కళ్యాణపులోవ రిజర్వాయర్‌ గరిష్ట నీటి మట్టం 460 అడుగులు కాగా..ప్రస్తుత నీటి మట్టం 451.2 అడుగులు ఉంది.

రైవాడ జలాశయాంలో గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా..ప్రస్తుతం 112.90 మీటర్లు ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 3,500 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరుతుంది. సోమవారం రాత్రికి ప్రమాదస్థాయికి( 113.50 మీటర్లు)కు చేరుకుంటే నీరు వదిలే అవకాశాలు ఉన్నాయి.

వరద గుప్పెట్లో... 1
1/4

వరద గుప్పెట్లో...

వరద గుప్పెట్లో... 2
2/4

వరద గుప్పెట్లో...

వరద గుప్పెట్లో... 3
3/4

వరద గుప్పెట్లో...

వరద గుప్పెట్లో... 4
4/4

వరద గుప్పెట్లో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement