
పోలీస్ కార్యక్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన
నక్కపల్లి: పోలీస్ శాఖ కార్యక్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగింది. మండల కేంద్రం నక్కపల్లిలో హెటెర్ కంపెనీ యాజమాన్యం సమకూర్చిన రూ.2.50 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో ఆధునిక వసతులతో కూడిన పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరిష్ కుమార్ గుప్తా ముఖ్యఅతిథులుగా హజరయ్యారు. హోం మంత్రి శంకుస్థాపన చేయగా శిలాఫలకాన్ని డీజీపీ, హోంమంత్రులు ఆవిష్కరించారు. శిలాఫలకంపై గ్రామ ప్రధమ పౌరురాలు, స్థానిక సర్పంచ్ జయరత్నకుమారి, మండల ప్రథమ పౌరురాలు, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ పేర్లు వేయలేదు. శిలాఫలకంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇన్‌చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్ససత్యనారాయణ, ఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు, ఎంఎల్‌సీ వేపాడ చిరంజీవి, జెడ్పీ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర పేర్లు వేశారు. భవనం నిర్మిస్తున్న స్థానిక సర్పంచ్ , మండల పరిషత్ అధ్యక్షురాలు, జిల్లా ప్రాదేశిక సభ్యురాలు పేర్లు వేయకపోవడం గమనార్హం. దళిత మహిళలం కావడంతోనే మాపై చిన్నచూపు చూసి శిలాఫలకంలో తమ పేర్లు వేయలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రధానమంత్రి పాల్గొనే అధికారిక కార్యక్రమంలో సైతం స్థానిక సర్పంచ్‌కు ప్రొటోకాల్ పాటిస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో నక్కపల్లిలో జరిగిన సీఎం చంద్రబాబు పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో అప్పటి మహిళా సర్పంచ్‌ను స్టేజీపైకి ఆహ్వానించారని వారు గుర్తు చేస్తున్నారు. శిలాఫలకంలో ప్రొటోకాల్ పాటించకపోవడం, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ పేర్లు వేయకపోవడంపై సీఐ కుమార స్వామి వద్ద ప్రస్తావించగా కలెక్టర్ కార్యాలయం నుంచి తీసుకున్న ప్రొటోకాల్ జాబితా ప్రకారమే శిలాఫలకాన్ని తయారు చేయడం జరిగిందన్నారు. గతంలో పలు ప్రాంతాల్లో జరిగిన ఇటువంటి కార్యక్రమాల్లో స్థానిక సర్పంచ్‌ల పేర్లు వేయలేదన్నారు.