
‘వ్యాపారులకు ఆర్టీసీ స్థలాలు ధారాదత్తం’
అనకాపల్లి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ స్ధలాలను బడా వ్యాపారవేత్తలకు దారాదత్తం చేస్తోందని ఏపి పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ కార్యదర్శి భాసూరు కృష్ణమూర్తి విమర్శించారు. సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం 2014లో కూడా ఇలాగే ఆర్టీసీ స్ధలాలను అనుకూల వ్యాపారవేత్తలకు కట్టబెట్టిందన్నారు. తాజాగా విజయవాడ నగరం నడి బొడ్డున ఉన్న ఆర్టీసీ స్థలాన్ని లులూ షాపింగ్ మాల్‌కు కేటా యిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జివో 137ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసే 4.15 ఎకరాల స్ధలం లులూ షాపింగ్ మాల్‌కు కట్టబెట్టడం దారుణమన్నారు. ఇదే షాపింగ్ మాల్ నగర శివారు ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా డీఏ బకాయిలను ఇంతవరకు చెల్లించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పజెప్పడం చూస్తుంటే రానున్న కాలంలో సంస్థను ప్రైవేటీకరణ వైపు నడిపించే యోచనలో ఉందని తెలుస్తోందన్నారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు లోవరాజు, యూనియన్ నాయకులు తాతాలు, ఎస్.వి.రమణ, డి.ఎల్ రాజు, ఐఎస్ బాబు, వై.వి.ఎస్ కుమార్ పాల్గొన్నారు.