
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
● వైఎస్సార్‌సీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత
గొలుగొండ : కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆదివారం సాయంత్రం ఏఎల్‌పురంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వల్ల మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నాయకులు అనేక అబద్దపు హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు మోసపోయారన్నారు. మహిళల కు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని చెప్పి ఇప్పుడు కొన్ని బస్‌లకు మాత్రమే పరిమితం చేయడం జరుగుతుందని కూటమి పాలకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దీని వల్ల ఉచిత బస్ ప్రయాణం పధకం పక్క దారి పట్టిందన్నారు. బడిగుడి అనే తేడా లేకుండా రాష్ట్రం, జిల్లా, మండలాల్లో మద్యం దుణాకా లు ఇవ్వడం జరిగిందని, ఇది చాలదన్నట్టు ప్రస్తుతం పర్మిట్ రూంలకు వీలు కల్పిస్తూ కొత్త గా చట్టం తీసుకురావడం వల్ల మహిళలు రోడ్డు మీదిగా రావాలంటే బయపడే పరిస్థితి వచ్చిందన్నారు. తల్లికి వందనం పథకంలో చాలామంది తల్లులకు అన్యాయం జరిగిందని, నేటికీ చాలామందికి ఆర్థికసాయం అందలేదని ఆరోపించారు.