
కింగ్స్‌పై సన్‌షైనర్స్ ఘన విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) నాలుగో సీజన్‌లో విజయవాడ సన్‌షైనర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్‌పై 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో విజయవాడ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయగా, కాకినాడకు ఇది రెండో ఓటమి. నగరంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో టాస్ ఓడి తొలుత విజయవాడ బ్యాటింగ్‌కు దిగింది. టాప్ ఆర్డర్ విఫలమైనా, చివరిలో జహీర్ (57 నాటౌట్), తేజ (46 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. కాకినాడ బౌలర్లలో స్పిన్నర్ ఆంజనేయులు మూడు వికెట్లు తీశాడు. అనంతరం 196 పరుగుల లక్ష్యఛేదనలో కాకినాడ కింగ్స్‌కు ఓపెనర్లు అర్జున్ (48), కెప్టెన్ భరత్ (34) తొలి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. అయితే వారు ఔటైన తర్వాత కాకినాడ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. రవికిరణ్ (31) మినహా మిగతా వారు విఫలం కావడంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 171 పరుగులకు ఆలౌట్ అయింది. విజయవాడ బౌలర్లు పృథ్వీ, టి.భరత్ చెరో మూడు వికెట్లతో కాకినాడ పతనాన్ని శాసించారు.
అదరగొట్టిన కెప్టెన్ హేమంత్
ఏపీఎల్‌లో భాగంగా వైఎస్సార్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో భీమవరం బుల్స్ జట్టు రాయలసీమ రాయల్స్‌పై 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భీమవరం బుల్స్, రాయలసీమ రాయల్స్‌ను కట్టడి చేసింది. రాయల్స్ కెప్టెన్ రషీద్ (56) అర్ధశతకంతో రాణించినప్పటికీ.. ఆ జట్టు చివర్లో అనూహ్యంగా కుప్పకూలింది. కేవలం 17 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లను కోల్పోయి, మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 139 పరుగులకు ఆలౌటైంది. బుల్స్ బౌలర్లలో సత్యనారాయణ మూడు వికెట్లు తీయగా, హరిశంకర్, మునీష్, హేమంత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 140 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ కెప్టెన్ హేమంత్ అద్భుత ఇన్నింగ్స్‌తో సునాయాసంగా గెలిచింది. హేమంత్ 65 పరుగులు (3 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి వంశీకృష్ణ (27 నాటౌట్), సూర్యతేజ (23 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో బుల్స్ జట్టు 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.