
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
● జిల్లాలో బలవంతపు భూసేకరణ ఆపాలని రైతుల ఆందోళన ● ఫ్రీ బస్సు పథకంపై ఆటో డ్రైవర్ల నిరసన ● పీజీఆర్‌ఎస్‌లో 291 అర్జీల నమోదు
తుమ్మపాల: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పలు ప్రజా సంఘాలు, రైతుల నిరసనలతో హోరెత్తింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో చేపడుతున్న భూసేకరణలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆవేదనను నిరసనల రూపంలో తెలియజేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో తమ ఉపాధికి గండి పడుతుందని ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. ఇలా నిరసనలు, విన్నపాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పీజీఆర్‌ఎస్ నమోదు శిబిరం వద్ద కంప్యూటర్లు పనిచేయలేదు.దీంతో ఫిర్యాదుదారులు అర్జీలు పట్టుకుని క్యూలోనే నిరీక్షించారు. అర్జీదారుల నుంచి కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ జాహ్నవి, డీఆర్వో సత్యనారాయణరావు అర్జీలు స్వీకరించారు. మొత్తం 291 అర్జీలు నమోదయ్యాయి.
బల్క్ డ్రగ్ పార్కుకు భూమిలిచ్చేది లేదు..
బల్క్ డ్రగ్ పార్క్ కోసం భూసేకరణ నోటీస్6(ఎ)ను ఉపసంహరించుకోవాలని కోరుతూ నక్కపల్లి మండలం సీహెచ్‌ఎల్ పురం పరిధిలో జానకియ్యపేట గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. గ్రామంలో 192 ఎకరాల పచ్చని భూమిని సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, పర్యావరణ, మత్స్యకారుల ఉపాధికి నష్టం కలిగించే ప్రమాదకరమైన పరిశ్రమకు భూములిచ్చేది లేదంటూ తేల్చిచెప్పారు. గత నెల 25న నక్కపల్లి తహసీల్దార్‌కు అభ్యంతర లేఖలు అందజేశామని, ఈ నెల 6న చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా తీవ్రంగా వ్యతిరేకించామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయం తప్ప వేరే జీవనాధారం లేని తమకు తాతముత్తాల నుంచి సంక్రమించిన భూములు ఇచ్చేదిలేదని, తక్షణమే భూసేకరణ నోటీసులు రద్దు చేయాలని కోరారు.
వీహెచ్‌పీ సభ్యుల నిరసన
గోశాలపై ఫిర్యాదు చేసినందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యుడు సోమిరెడ్డి రాజుపై హత్యాయత్నం చేసిన దుండగులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లుకు చెందిన కొంతమంది రక్షణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ముఠాగా ఏర్పడి గోవుల అక్రమ రవాణా చేస్తున్న వ్యవహారంపై సోమిరెడ్డి రాజు ఫిర్యాదు చేశారన్న కక్షతో ముఠా ముఖ్య సభ్యులు, రౌడీ షీటర్ గొర్ల దేవుళ్ళు, గోకులపాడుకు చెందిన సమ్మంగి నానాజీ, నానేపల్లి లక్ష్మణ్ తండ్రి రాజబాబు ఇంటిలోకి చొరబడి చంపేందుకు ప్రయత్నించారని, తక్షణమే చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.