
ముగిసిన ఖోఖో పోటీలు
పాయకరావుపేట: మూడు రోజులుగా శ్రీప్రకాష్ విద్యా సంస్థలో జరుగుతున్న సీబీఎస్‌ఈ క్లస్టర్–7 తెలుగు రాష్ట్రాల బాల బాలికల ఖోఖో పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభలో విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ అంతర్రాష్ట్ర ఖోఖో చాంపియన్ షిప్ పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 180కి పైగా జట్లు, 2000 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విజేతలకు మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోటీల పరిశీలకుడు సిహెచ్.ఎల్.ఎం.శ్రీనివాస్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.అపర్ణ, వివిధ ప్రాంతాల విద్యార్థులు, కోచ్‌లు, మేనేజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు
అండర్–19 బాలికల విభాగంలో సిస్టర్ నివేదిత స్కూల్, హైదరాబాద్ జట్టు ప్రథమ స్థానంలో, వెరిటాస్ సైనిక్ స్కూల్ తిరుపతి జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. అండర్ –19 బాలుర విభాగంలో వెరిటాస్ సైనిక్ స్కూల్, తిరుపతి జట్టు ప్రథమ, ఫార్‌ూచ్యన్ బటర్‌ఫ్లై స్కూల్, మహబూబ్‌నగర్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. అండర్–17 బాలికల విభాగంలో శ్రీప్రకాష్ విద్యానికేతన్, పాయకరావుపేట ప్రథమ, మాంటిస్సోరి ఎలైట్ ఇంగ్లిషు మీడియం స్కూల్, అనంత్‌పూర్ ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. అండర్–17 బాలుర విభాగంలో శ్రీప్రకాష్ విద్యానికేతన్, పాయకరావుపేట ప్రథమ, ఎకార్ట్ స్కూల్, తిరుపతి జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. అండర్–14 బాలికల విభాగంలో హీల్ స్కూల్, నరసింగపాలెం ప్రథమ, సూర్యా అకాడమీ స్కూల్, హైదరాబాద్ జట్టు ద్వితీయ స్థానంలో మెరిశాయి. అండర్ –14 బాలుర విభాగంలో శ్రీ ప్రకాష్ విద్యానికేతన్, పాయకరావుపేట ప్రథమ, ఏకశిల ఇంటర్‌నేషనల్ స్కూల్, మహబూబ్‌నగర్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచినట్లు సిహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు.