పక్కదారి! | - | Sakshi
Sakshi News home page

పక్కదారి!

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

రాజ్‌మా విత్తనాలు
ఇష్టానుసారంగా పంపిణీ మారుమూల ప్రాంతాల రైతులకు అన్యాయం ప్రైవేట్‌ మార్కెట్‌లో అధిక ధరలు కొనలేకపోతున్న అన్నదాతలు కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

సాక్షి, పాడేరు: రాజ్‌మా విత్తనాల పంపిణీ వ్యవహారం జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. రైతులకు రాయితీతో పంపిణీ చేయాల్సిన విత్తనాలను పక్కదారి పట్టించారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో గంజాయి ప్రభావిత ప్రాంతాల గిరిజన రైతులు బయట మార్కెట్‌లో అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. గంజాయి సాగుకు దూరంగా ఉన్న మారుమూల గిరిజన గ్రామాలకు రాజ్‌మా విత్తనాలు పూర్తిస్థాయిలో అందకపోవడంతో అక్కడి రైతులు అవస్థలకు గురవుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం సబ్సిడీపై రాజ్‌మా విత్తనాల పంపిణీలో మారుమూల గ్రామాలకే అధిక ప్రాధాన్యత ఉండేది. పోలీసుశాఖ కూడా గంజాయి నిర్మూలన లక్ష్యంగా ఆయా గ్రామాలలో విత్తనాలు అధికంగా ఇవ్వాలని సూచించింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం రాజ్‌మా విత్తనాలను అరకొరగా కేటాయిస్తోంది. అందులోనూ మారుమూల గిరిజన రైతులకు పూర్తిగా పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. ఆ విత్తనాలను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

4,913 క్వింటాళ్ల కేటాయింపు

జిల్లాలో 18 వేల హెక్టార్లలో రాజ్‌మా పంట సాగు చేస్తుండగా, కేవలం 9,600 హెక్టార్లకు సరిపడే 4,913 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఏపీ సీడ్స్‌ నుంచి కిలో రూ.158 ధరతో సేకరించి, గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. గంజాయి సాగు నిర్మూలనలో భాగంగా జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, జి.కె.వీధి మండలాల్లోని మారుమూల గ్రామాల రైతులకు రాజ్‌మా విత్తనాలను అధికంగా ఇవ్వాల్సి ఉంది. కానీ వ్యవసాయశాఖ మాత్రం రోడ్డు పక్క గ్రామాలతో పాటు నచ్చిన ప్రాంతాల్లోని రైతులకు మాత్రమే సబ్సిడీ విత్తనాల పంపిణీ చేసి, మమ అనిపించింది. ఒడిశా సరిహద్దులో ఉన్న మారుమూల గ్రామాలకు విత్తనాలతో వాహనాలు కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ పంపిణీ చేయలేదని తెలిసింది.

ప్రైవేట్‌ మార్కెట్‌లో కిలో రూ.150

రాజ్‌మా విత్తనాలను ప్రైవేట్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కిలో రాజ్‌మా విత్తనాలను రూ.150 ధరతో వ్యాపారులు అమ్ముతున్నారు. ఎకరం పంటకు సుమారు 30 కిలోల వరకు రాజ్‌మా విత్తనాలు అవసరమవుతాయి. అధిక ధరలతో కొనే ఆర్థిక స్తోమత లేక మారుమూల గ్రామాల గిరిజనులు రాజ్‌మా పంట సాగుకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది.

విత్తనాలకోసం ఎదురుచూపులు

మారుమూల గ్రామాల్లోని రైతులు.. ప్రభుత్వం అందించే రాయితీ రాజ్‌మా విత్తనాలకు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తమ గ్రామాలకు ఆనుకుని ఉన్న కొండపోడు భూములలో తుప్పలు, డొంకలు తొలగించి విత్తనాలు జల్లేందుకు సిద్ధం చేశారు. సాగుకు పూర్తిస్థాయిలో సమాయత్తం అయినప్పటికీ గిరిజన రైతులకు విత్తనాల సమస్య వేధిస్తోంది.

అందని రాజ్‌మా విత్తనాలు

గంజాయి సాగుకు దూరంగా ఉన్న గిరిజనులంతా రాజ్‌మా చిక్కుళ్ల సాగుతోనే కొంతవరకు ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నారు. పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలో రాజ్‌మా విత్తనాలకు గిరిజనులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులంతా రాజ్‌మా సాగుకు కొండపోడు భూములను సిద్ధం చేసుకున్నారు. సబ్సిడీపై అందించే విత్తనాల కోసం అన్ని గ్రామాల గిరిజనులు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయశాఖ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

–కొర్రా జీవన్‌, గిరిజన రైతు, గబుడుపుట్టు గ్రామం, ఇంజరి పంచాయతి, పెదబయలు మండలం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement