అనంతగిరి (సాక్షి, పాడేరు): వివాదాస్పద భూములపై విచారణ జరపకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కార్పొరేట్ శక్తులకు సుమారు 30 ఎకరాల భూములను ధారాదత్తం చేయడంపై అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ గిరిశిఖర చిన్నకోనిల గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌వోఆర్ చట్టానికి వ్యతిరేకంగా సర్వే నంబర్ 1 నుంచి 5 వరకు 30.32 ఎకరాల జిరాయితీ భూమిని కార్పొరేట్ వ్యక్తులైన కర్రి సముద్రాలరెడ్డి, సూరెడ్డి త్రిలోక్, ప్రగాడ రాములు సాగు చేస్తున్నట్టు వెబ్‌సైట్‌లో నమోదవడంతో గిరిజనులంతా సోమవారం ఆందోళన చేపట్టారు. అర్ధనగ్నంగా ప్రదర్శన చేపట్టి రెవెన్యూ అధికారుల తీరును నిరసించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిరాయితీ భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఈ భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. గతంలో ఈ భూములపై పాడేరు సబ్‌కలెక్టర్ కోర్టులో ఆర్‌వోఆర్ కేసు దాఖలు చేశామని, 2020 నుంచి ఈ భూములు డిస్ప్యూట్ రిజిస్టర్‌లో నమోదయ్యాయన్నారు. అయితే వివాదాస్పద భూములపై విచారణ పూర్తికాక ముందే కార్పొరేట్ వ్యక్తులకు భూములను రెవెన్యూ అధికారులు అప్పగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సబ్‌కలెక్టర్ ఈ భూములను పరిశీలించి తమకు న్యాయం చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సోమిల అప్పలరాజు, కొనపర్తి సింహచలం, గిరిజన సంఘం నేత జన్ని శంకరరావు, గిరిజనులు పాల్గొన్నారు.
చిన్నకోనిలలో అర్ధనగ్నంగా గిరిజనుల ఆందోళన


