సాక్షి, పాడేరు: మహాకవి గురజాడ అప్పారావు జయంతిని కలెక్టరేట్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి కలెక్టర్ టి.నిశాంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాకవి రాసిన కన్యాశుల్కం ద్వారా ఆనాటి సమాజంలోని దురాచారాలను, మూఢనమ్మకాలను నిరసించారన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ దిశానిర్దేశం చేశారని తెలిపారు. ‘దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్’ అని ఆయన అందించిన అమూల్యమైన సందేశం నిరంతరం స్ఫూర్తిదాయకమన్నారు. గురజాడ రచనలు, గేయాలు నేటికీ సామాజిక చైతన్యానికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని చెప్పారు. మహాకవి చూపిన బాటలో పయనిస్తూ, సమాజ శ్రేయస్సుకు, అభ్యుదయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌వో లోకేశ్వరరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ రియాజ్‌బైగ్, జిల్లా టూరిజం అధికారి పట్టాసి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.


