76 ఏళ్ల ఉమ్మడి విశాఖ జెడ్పీకి నేడే చివరి సర్వసభ్య సమావేశం
మూడు జిల్లాలుగా విడిపోనున్న ఉమ్మడి జెడ్పీ
కేవలం 4 మండలాలతో రాష్ట్రంలోనే అతిచిన్న జెడ్పీగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ఒకనాడు రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా పరిషత్‌లలో ఒకటిగా వెలుగొందిన ఉమ్మడి విశాఖ జెడ్పీ చరిత్ర ముగియనుంది. 1950లో ఆవిర్భవించిన ఈ సంస్థ.. 76 ఏళ్ల ప్రస్థానం అనంతరం మూడు జిల్లాలుగా విడిపోనుంది. ప్రస్తుత పాలకవర్గం గడువు ఈ నెల 24తో ముగియనుండగా.. నేడు జరిగే సర్వసభ్య సమావేశమే ఉమ్మడి విశాఖ జెడ్పీకి చివరిది కానుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు జెడ్పీలు ఏర్పడనున్నాయి.
నాలుగు మండలాలకే విశాఖ జెడ్పీ
ఉమ్మడి విశాఖ జెడ్పీ పరిధిలో గతంలో 39 మండలాలు ఉండేవి. తాజా విభజనతో అనకాపల్లి జెడ్పీ పరిధిలో 24 మండలాలు, అల్లూరి సీతారామరాజు జెడ్పీ పరిధిలో 11 మండలాలు చేరనున్నాయి. విశాఖ జెడ్పీకి మాత్రం భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాలు మాత్రమే మిగలనుండటంతో.. నాలుగు మండలాలతో రాష్ట్రంలోనే అతిచిన్న జిల్లా పరిషత్‌గా విశాఖ జెడ్పీ ఏర్పడనుంది.
1950లో మొదలు.. 2026లో ముగింపు
విశాఖ జిల్లా పరిషత్ ప్రస్థానం 1950లో ప్రారంభమైంది. 1959లో సమితులు, తాలూకాలు, జిల్లా బోర్డుల వ్యవస్థగా కొనసాగిన ఈ సంస్థ.. 1983లో మండల, జిల్లా ప్రజా పరిషత్‌లుగా రూపాంతరం చెందింది. 1986లో పూర్తిస్థాయి మండల, జిల్లా ప్రజా పరిషత్‌గా ఏర్పడింది. 2021 సెప్టెంబర్ 25న జె. సుభద్ర అధ్యక్షతన ప్రస్తుత పాలకవర్గం కొలువుదీరింది. ఈ పాలకవర్గం గడువు ఈ నెల 24తో ముగియడంతో ఉమ్మడి విశాఖ జెడ్పీకి అధికారికంగా తెరపడనుంది. చివరి చైర్‌పర్సన్‌గా జల్లిపల్లి సుభద్ర నిలవనున్నారు.
సిబ్బంది కేటాయింపులోనూ విభజన
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఈ నెల 25 నుంచి విభజన ప్రక్రియ అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది కేటాయింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖలో సీనియారిటీ ఆధారంగా బదిలీలు, సిబ్బంది పంపకాలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జెడ్పీ పరిధిలోని 876 మంది అధికారులు, సిబ్బందిని జిల్లాల వారీగా సర్దుబాటు చేయనున్నారు. అనకాపల్లి జిల్లాకు 60 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 30 శాతం, విశాఖ జిల్లాకు 10 శాతం చొప్పున కేటాయించనున్నారు.
నిధులు, అభివృద్ధిపై సందేహాలు?
ఒకప్పుడు 39 మండలాలతో విస్తరించిన ఉమ్మడి విశాఖ జెడ్పీ.. ఇప్పుడు కేవలం నాలుగు మండలాలకే పరిమితం కానుంది. కొత్త జెడ్పీలో చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులతో పాటు పరిమిత సంఖ్యలో సభ్యులతో పాలన సాగనుంది. ఇంత చిన్న పరిధిలో జెడ్పీకి వచ్చే నిధులు, చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనలపై ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో పలుచోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయా గ్రామాలు కూడా జీవీఎంసీలో విలీనమైతే విశాఖ జెడ్పీ పరిధి మరింత తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో నిధులు, అభివృద్ధిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జెడ్పీ సర్వసభ్య సమావేశం నేడు
మహారాణిపేట: జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి.నారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. చైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పాలకవర్గానికి ఇదే చివరి సమావేశమన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన అన్ని శాఖల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని సూచించారు. ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు సమావేశానికి హాజరుకావాలని కోరారు.


