తండ్రిని చిన్నతనంలోనే కోల్పోయి.. పుట్టుకతో వచ్చిన వినికిడి, మాటల సమస్యతోనూ పోరాడుతున్నా గంగోత్రి తన కలను వదులుకోలేదు. పేదరికం, చదువు మధ్యలో ఆగిపోవడం వంటి ఎన్నో కష్టాలను అధిగమించి బ్యాడ్మింటన్ రాకెట్‌ను తన ఆయుధంగా మార్చుకుంది. తల్లి అండతో గ్రామీణ వేదిక నుంచి జాతీయ స్థాయి పోటీల వరకు ఎదిగిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
డెఫ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గంగోత్రి విజయ ప్రస్థానం
● కష్టాల మధ్య.. కలల పరుగు
● అమ్మ అండతో.. ఊహించని స్థాయికి
తల్లి కష్టం..
కూతురి పట్టుదల
పాడేరు రూరల్: ఓ వైపు పుట్టుకతోనే వినికిడి, మాట్లాడే సమస్య.. మరోవైపు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన బాధ.. ఇంటి పరిస్థితులు చూస్తే చదువు కూడా మధ్యలోనే ఆగిపోయింది. అయినా ఆమె అడుగులు ఆగలేదు. చేతిలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకుని.. తన కలల వెంట పరుగులు తీసింది. ఆమెనే పాడేరు మండలం కిండంగి పంచాయతీ సేరుబయలు గ్రామానికి చెందిన డెఫ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి రాజాన గంగోత్రి (23). గ్రామంలోని చిన్న వేదిక నుంచి మొదలైన ఆమె ప్రయాణం.. ఇప్పుడు జాతీయ స్థాయి పోటీల వరకు చేరింది.
● తండ్రి లేకపోయినా తల్లి ధైర్యం చెప్పింది. యలమంచిలి సమీపంలోని బీసీటీ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన గంగోత్రి.. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువును కొనసాగించలేకపోయింది. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లి.. తన బిడ్డ కలకు మాత్రం అడ్డుకాలేదు. డబ్బు లేకున్నా క్రీడపై ఉన్న మక్కువను గంగోత్రి వదులుకోలేదు.
రాకెట్ పట్టిన చేతికి.. పతకాలు..
2022లో మొదలైన బ్యాడ్మింటన్ ప్రయాణం.. తొలుత గ్రామ, మండల స్థాయిలో సాగింది. బీసీటీ పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాడేరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో శిక్షణ పొందింది. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ.. డెఫ్ ఫౌండేషన్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని పోటీల్లో తన ప్రతిభను చాటుకుంది.
● ఇప్పటి వరకు మండల స్థాయిలో రెండుసార్లు, డివిజన్ స్థాయిలో రెండుసార్లు, జిల్లా స్థాయిలో మూడుసార్లు, రాష్ట్ర స్థాయిలో నాలుగుసార్లు, జాతీయ స్థాయిలో ఒకసారి పోటీల్లో పాల్గొంది. తొమ్మిది ప్రశంసాపత్రాలు, ఒక గోల్డ్ మెడల్, నాలుగు షీల్డులు అందుకుంది. ప్రతి పతకం వెనుక తల్లి చేసిన కష్టం.. ప్రతి విజయం వెనుక గంగోత్రి పట్టుదల ఉంది.
అండగా నిలిచిన మంచి మనసులు
పోటీలకు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు.. క్రీడా సామగ్రి.. శిక్షణకు అయ్యే వ్యయం.. ఇలా ప్రతి అడుగులోనూ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా కొన్ని మంచి మనసులు ఆమెకు అండగా నిలిచాయి. గత ఏడాది జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు స్థానిక వైఎస్సార్‌సీపీ నేత సూర్యనారాయణతో పాటు పలువురు నేతలు ఆర్థిక సహాయం చేసినట్లు గంగోత్రి తెలిపింది. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపూజను ఆశ్రయించిన సందర్భాల్లోనూ సహకారం అందిందని పేర్కొంది.
● కూతురు క్రీడల్లో ముందుకు వెళ్లేందుకు తల్లి ఇప్పటికీ కూలీ పనులు చేస్తూనే అండగా నిలుస్తోంది. తల్లి పనులకు చేతనైన సాయం చేస్తూనే.. సమయం దొరికినప్పుడల్లా గంగోత్రి బ్యాడ్మింటన్ సాధన చేస్తోంది. జాతీయ స్థాయికి చేరుకున్న ఈ ప్రతిభకు మరింత శిక్షణ, క్రీడా సామగ్రి, ఆర్థిక సహకారం అందితే మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందని గ్రామ పెద్దలు కోరుతున్నారు.
● తండ్రి లేని ఇంట్లో.. తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆ అమ్మాయి.. ఇప్పుడు జాతీయ స్థాయి కోర్టులో తన ప్రతిభను చాటుతోంది. మాటలు వినిపించకపోయినా.. ఆమె రాకెట్ చేసే శబ్దం మాత్రం విజయానికి సంకేతంగా మారుతోంది. గంగోత్రి గెలవాల్సింది ఒక్క మ్యాచ్ కాదు.. తనలాంటి ఎంతోమంది పిల్లలకు ‘కలలు కనొచ్చు’ అనే నమ్మకాన్ని ఇవ్వాలి.
చదువు ఆగిపోయినా..
నా ఆట ఆగదు
ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చదువును మధ్యలోనే ఆపేశాను. కానీ ప్రాణంగా ఇష్టపడే బ్యాడ్మింటన్‌లో మాత్రం రాణించాలనుంది. దాతలు, ప్రభుత్వం ప్రోత్సహిస్తే మా ప్రాంతానికి మంచి పేరు తీసుకువస్తాను. మరిన్ని విజయాలు సాధించి నా తల్లి కష్టానికి ఫలితం ఇవ్వాలనుంది.. అని డెఫ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఆర్.గంగోత్రి తెలిపింది.


