పాడేరు: గిరిజన ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించి మాతా, శిశు మరణాలను సంపూర్ణంగా నివారించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి స్పష్టం చేశారు. అలాగే టీనేజ్ గర్భధారణలు, బాల్య వివాహాలను అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో అడుగులు వేస్తోందన్నారు. పాడేరు శంకరన్ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ’ఏఎస్‌ఆర్ – షాతి’ కార్యక్రమాన్ని గురువారం జిల్లా కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏఎస్‌ఆర్ జిల్లాలోనే ఈ ‘షాతి’ కార్యక్రమాన్ని రూపొందించి ప్రారంభించామని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రతి గర్భిణికి సురక్షితమైన ప్రసూతి పూర్వ వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గర్భధారణ ప్రారంభ సమయం నుండి ప్రసవం వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఏ తల్లి కూడా బిడ్డను కోల్పోయే పరిస్థితి రాకూడదని ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు గర్భిణులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రమాదకర గర్భధారణలను (హై–రిస్క్ ప్రెగ్నెన్సీ) ముందుగానే గుర్తించి తగిన వైద్య చికిత్సలు అందించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా తీవ్ర నేరమని, ఎవరైనా బాల్య వివాహాలు జరిపించినా లేదా ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్, డీఎంహెచ్‌వో డాక్టర్ రియాజ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, డాక్టర్ ప్రతాప్, డాక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, ఐసీడీఎస్, వైద్యారోగ్య శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ నిశాంతి


