● అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
● ఉద్యోగ సంఘాల ప్రతినిధుల డిమాండ్
పాడేరు రూరల్: అనంతగిరి మండల విద్యాశాఖ అధికారి–1 బాలాజీ తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు గురువారం పాడేరులో డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాసాడ ఈశ్వర్‌రావు, డీటీఎఫ్, ఏపీటీఎఫ్, పీఆర్‌టీయూ, బీటీఏ సంఘాల నేతలు సన్యాసిరావు, గురుదొర, రామకృష్ణ, దేముడు తదితరులు మాట్లాడారు. 2023 నుంచి ఇప్పటివరకు ఎంఈఓ పాఠశాలలకు సంబంధించిన సామగ్రి, మధ్యాహ్న భోజన నిధులను స్వాహా చేశారని ఆరోపించారు.జీనబాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి, భవన నిర్మాణ పనులు ఏమాత్రం జరగకుండానే రూ. 11,98,000 నిధులను డ్రా చేసుకున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ వేస్తూ ఒక్కో ఉపాధ్యాయుడి వద్ద నుంచి రూ. 30 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు. మండలంలోని 175 పాఠశాలల ఫేషియల్ హాజరులో జోక్యం చేసుకోవడమే కాకుండా, మధ్యాహ్న భోజన బిల్లుల మంజూరుకు రూ. 500 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు.బదిలీపై వెళ్లే ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ ప్రక్రియ కోసం రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు లంచం తీసుకుంటున్నారు. ఎంఈవో బాలాజీ అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.


