● జూనియర్ డాక్టర్ల స్పష్టీకరణ
● పాడేరు జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన.. విధుల బహిష్కరణ
పాడేరు: తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేంత వరకు శాంతియుత పోరాటం కొనసాగిస్తామని జిల్లా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ మహేష్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు గురువారం పాడేరు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి, ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ మాట్లాడుతూ.. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని, ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 నుంచి నిరసనలు తెలుపుతూ, 17వ తేదీ నుంచి విధులను పూర్తిగా బహిష్కరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్చలకు పిలవకపోవడం విచారకరమన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు డాక్టర్ అమన్, పృథ్వీ, భానుతో పాటు పలువురు జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.


