ఏయూకి ఎన్‌బీఏ షాక్‌! | - | Sakshi
Sakshi News home page

ఏయూకి ఎన్‌బీఏ షాక్‌!

Aug 15 2026 12:52 AM | Updated on Aug 15 2026 12:52 AM

నిబంధనలకు విరుద్ధంగా బోర్డు లోగో వినియోగం

తప్పుడు ప్రచారంపై ఎన్‌బీఏ యాజమాన్యం సీరియస్‌

తక్షణమే తొలగించాలని ఆదేశం

విశాఖ విద్య: శతాబ్ద ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్టను పాలకులే మంటగలుపుతున్నారు. విద్యా ప్రమాణాలను గాలికొదిలేసి.. బాధ్యతారాహిత్యంగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఏయూ పరువును బజారుకీడిస్తున్నారు. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) లోగోను వాడుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఏయూ వ్యవహారశైలిపై చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మోసపూరిత వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తక్షణమే ఆ తప్పుడు ప్రచారాన్ని తొలగించాలంటూ ఏయూ పాలకులకు ఎన్‌బీఏ యాజమాన్యం.. గట్టి మొట్టికాయలు వేసింది.

ఫిర్యాదుతో వెలుగులోకి..

ఆంధ్రా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌కు సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ గతనెల 17వ తేదీన ఎన్‌బీఏ మెంబర్‌ సెక్రటరీకి లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. దీనిపై తక్షణమే స్పందించిన బోర్డు అధికారులు, వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించారు.

నాడు కమిటీలకు ‘నజరానాలు’?

నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతులు, ఫ్యాకల్టీ కొరతను మెరుగుపరచడం ద్వారా అధికారిక గుర్తింపులు సాధించాల్సిన ఏయూ పాలకవర్గం అడ్డదారులు తొక్కడం కొత్తేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విశ్వవిద్యాలయానికి తనిఖీల నిమిత్తం వచ్చిన అధికారిక కమిటీ ప్రతినిధులకు గిఫ్ట్‌ ప్యాకెట్లు ఆఫర్‌ చేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేగింది. ఆ వివాదం విద్యా వర్గాల్లో యూనివర్సిటీ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా దేశవ్యాప్తంగా ఏయూ పరువును తీసింది. ఆ చేదు అనుభవాల నుంచి ఏమాత్రం పాఠాలు నేర్వని పాలకులు, ఇప్పుడు సరికొత్త మోసపూరిత ప్రచారానికి తెరలేపారు.

లోగోను తక్షణమే తొలగించాలని ఆదేశం

ఈ తీవ్ర నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్‌బీఏ యాజమాన్యం.. వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రకటనలు, లెటర్‌హెడ్‌లు, బిల్‌బోర్డులు, ఇతర ప్రచార సామగ్రి నుంచి ఎన్‌బీఏ లోగోను, అసంపూర్తిగా ఉంటూ తప్పుదోవ పట్టించేలా ఉన్న సమాచారాన్ని తక్షణమే తొలగించాలని ఆంధ్రా యూనివర్సిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకప్పుడు పరిశోధనలు, విద్యా ప్రమాణాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన విశ్వవిద్యాలయం.. ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌తో, గిఫ్టుల వివాదాలతో జాతీయ స్థాయి నియంత్రణ మండళ్ల నుంచి చీవాట్లు తినడం వర్సిటీ పూర్వ విద్యార్థులు, అధ్యాపక వర్గాలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

అనుమతి లేని లోగో

ఏయూ వెబ్‌సైట్‌లో ఎన్‌బీఏ లోగోను ప్రదర్శిస్తున్నప్పటికీ, అసలు ఏ ప్రోగ్రామ్‌ లేదా కోర్సుకు గుర్తింపు లభించింది? దాని స్థాయి ఏమిటి? ఆ గుర్తింపు ఏ కాలపరిమితి వరకు అమల్లో ఉంది? అనే కనీస వివరాలను ఎక్కడా పేర్కొనలేదని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ఎన్‌బీఏ నిబంధనావళి ప్రకారం ఏ విద్యాసంస్థ కూడా బోర్డు అధికారిక లోగోను తమ వెబ్‌సైట్‌లు, లెటర్‌హెడ్‌లు, అధికారిక ప్రకటనలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు లేదా ప్రచార సామగ్రిపై ముద్రించడానికి ఎలాంటి అనుమతి లేదని తేల్చిచెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement