గూడెంకొత్తవీధి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడెంలో శుక్రవారం సీఆర్‌పీఎఫ్ జీ/23 బెటాలియన్ ఆధ్వర్యంలో హర్‌ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై కొంతదూరం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రాధాన్యాన్ని వివరిస్తూ, దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
పెదబయలు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేయాలని పెదబయలు 198 బెటాలియన్ ఆధ్వర్యంలో హర్‌ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి అంబేడ్కర్ కూడలి మీదుగా స్టేట్ బ్యాంకు వరకు విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలను చేతబూని ర్యాలీ చేపట్టారు. ఇళ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి భావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, సెంటాన్స్ ఇంగ్లిష్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టులో హార్ ఘర్ తిరంగా ర్యాలీ..
ముంచంగిపుట్టు : మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక 198 బెటాలియన్ సీఆర్పీఎఫ్ బలగాలు హార్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించాయి. అసిస్టెంట్ కమాండెంట్ ముఖేష్‌కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో సిఆర్‌పిఎఫ్ జవాన్లు, పోలీసులు, స్థానికులు పోలీసు స్టేషన్ నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదగా జెడ్పీ అతిథి గృహం వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌ఫీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్‌కుమార్, ఎస్‌ఐ నాని, సీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ వీవీ దొర, పోలీసులు పాల్గొన్నారు.
సీలేరు: స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి దేశ గౌరవాన్ని కాపాడాలని సీలేరు సీఆర్‌పీఎఫ్ ఎఫ్/42 బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ టి. అశోక్ అన్నారు. కులమతాలకు అతీతంగా హర్‌ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో వందే మాతరం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇన్‌స్పెక్టర్ కృష్ణన్, ఏఎస్‌ఐ కె.వి. శివయ్య, ఎస్‌ఐ ఎం.డి. యాసీన్‌తో పాటు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.


