ఆపరేషన్ కగార్‌తోమావోయిస్టులు తగ్గుముఖం
కొయ్యూరు: ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. మంగళవారం ఆయన కొయ్యూరు,మంప స్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులను పరశీలించారు. సీఐ శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో కూడా మావోయిస్టులు కదలికలు తగ్గాయన్నారు. గంజాయి సాగు పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గిరిజనులు అవగాహన పెంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని చాలా వరకు తగ్గించామని చెప్పారు. ఇప్పటికీ గంజాయిపై పూర్తిగా నిఘా ఉంచామని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా సహించబోమని ఆయన హెచ్చరించారు. శాంత్రి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ను పెంచుతున్నామన్నారు. దీనిలో బాగంగా గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా ఎవరు పేకాట, కోడిపందాలకు పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రజలకు సత్వరమే న్యాయం అందేలా చేస్తామన్నారు. జాతీయ రహదారి 516ఈలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వీటి నివారణకు వీలుగా ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. పశువులను రోడ్లపై ఉంచరాదని సూచించారు. సంతలు, నిర్దేశించిన గ్రామాల్లో వాలీబాల్ పోటీలను నిర్వహించి గిరిజన యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో కొయ్యూరులో డైవింగ్‌లైసెన్స్ మేళాను నిర్వహిస్తామన్నారు.ఆర్టీవోతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కొయ్యూరు, మంప ఎస్‌ఐలు కిషోర్‌వర్మ, ఎస్. శ్రీనివాస్ పాల్గొన్నారు


