ఎప్పుడు?
వచ్చే ఏడాది మే వరకు గడువు ఇప్పటి వరకు 50 శాతం మేర మాత్రమే పనులు పూర్తి సకాలంలో పూర్తయ్యే పరిస్థితులు తక్కువే.. ఆధునిక వైద్యం అందుబాటులో లేక అల్లాడుతున్న గిరిజనం
రంపచోడవరంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు గడువులోగా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆశించిన 11 మండలాల ప్రజలను చురుగ్గా సాగకపోవడం నిరాశపరుస్తోంది. మెరుగైన వైద్యం కోసం వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలకు వెళ్లలేక, ఇటు స్థానికంగా సదుపాయాలు లేక గిరిపుత్రులు అల్లాడిపోతున్నారు.
సూపర్ వైద్యం
రంపచోడవరం: గిరిజనులు అత్యవసర వైద్యం కోసం రాజమహేంద్రవరం, కాకినాడ వెళ్లాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో అక్కడికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మారేడుమిల్లి మండలం చాపరాయి వచ్చినప్పుడు వైద్యసేవల సమస్యను గిరిజనుల నుంచి ఆయన నేరుగా తెలుసుకున్నారు. అధికారం చేపట్టిన వెంటనే రంపచోడవరంలో మల్టీపర్పస్ సూపర్ సెష్పాలిటీ ఆస్పత్రిని మంజూరు చేశారు. రూ.50 కోట్లతో రూ. 150 పడకల సామర్థ్యం గల దీనికి 2023లో అప్పటి ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ శంకుస్థాపన చేశారు. అప్పటిలో నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. ఇవి వచ్చే ఏడాది మే నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉంది. అయితే సుమారు ఐదు నెలలు మాత్రమే గడువు ఉంది. శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఇప్పటివరకు 50 శాతం మేర పనులు మాత్రమే జరిగాయి. మిగతా పనులు సకాలంలో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే అత్యవసర వైద్యానికి ఇబ్బంది ఉండదని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. దీనిపై వైద్యవిధాన పరిషత్ డీసీహెచ్‌ఎస్ నీలవేణిని వివరణ కోరగా రంపచోడవరంలో సూపర్ సెష్పాలిటీ ఆసుపత్రి నిర్మాణం గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వంద పడకలకు స్థాయి పెంచినా..
రంపచోడవరం ఏరియా ఆస్పత్రిని 2014–19 మధ్య అప్పటి అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వంద పడకల ఆస్పత్రిగా స్థాయి పెంచింది. అయినప్పటికీ ఎటువంటి వసతులు కల్పించలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వంద పడకల వసతులతోపాటు తల్లీపిల్లల కోసం ప్రత్యేకంగా భవనం నిర్మించింది. మారుమూల గ్రామాల గిరిజనులకు వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో పీహెచ్‌సీలను మంజూరు చేసింది.
రంపచోడవరంలో నత్తనడకను తలపిస్తున్న మల్టీపర్పస్ సూపర్ సెష్పాలిటీ ఆస్పత్రి నిర్మాణం


