ఆశ్రమ విద్యార్థిని మృతిపై విచారణ
విద్యార్థులతో మాట్లాడుతున్న ఏడీఎంహెచ్‌వో ప్రతాప్
సీలేరు: స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో పాంగి నందిని మృతిపై అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్ విచారణ చేపట్టారు. మంగళవారం ఆయన పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. శుభత్ర పాటిస్తే ఎటువంటి వ్యాధులు దరిచేరవన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఏజెన్సీలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో వైద్య సిబ్బందిని నియమించేలా సంబంధిత అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. ఇకపై ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా రక్తపరీక్షలు చేపట్టేలా సంబంధిత వైద్యులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సికిల్ సెల్ ప్రోగ్రాం ఆఫీసర్ బాబ్జి మాట్లాడుతూ రక్తహీనతను ప్రతి ఒక్కరూ మంచి ఆహారంతో దూరం చేయవచ్చన్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రాగిజావ, చక్కీలు ఎంతో మేలు చేస్తాయన్నారు. వైద్యాధికారి నారాయణరావు, హెల్త్ సూపర్‌వైజర్ త్రినాథ్, వార్డెన్ శకుంతల పాల్గొన్నారు.


