స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకోవాలి
విశాఖ విద్య: అమెరికాలో ఉన్నత విద్య, పరిశోధనలకు అందించే వివిధ స్కాలర్‌షిప్‌లను భారతీయ యువత సద్వినియోగం చేసుకోవాలని యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైన్నె రీజినల్ ఆఫీసర్ మాయా సుందర రాజన్ అన్నారు. మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల పరిధిలో ఫుల్‌బ్రైట్ నెహ్రూ స్కాలర్‌షిప్‌తో పాటు వివిధ స్కాలర్‌షిప్‌లపై అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌లపై విస్తృత అవగాహన కల్పించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంతో ఉన్నత విద్య సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా ఈ స్కాలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ 1946లో ప్రారంభమైందని, ప్రస్తుతం 160 దేశాల్లో ఇది అమలవుతుందని చెప్పారు. ఇప్పటివరకు నాలుగు లక్షల మందికి ఈ స్కాలర్‌షిప్ ద్వారా అమెరికాలో ఉన్నత విద్యను పొందే అవకాశాన్ని పొందారని చెప్పారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.వి.ఆర్. రాజు మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్య, పరిశోధన జరపడానికి ఎంతో ఉపయోగకరంగా స్కాలర్‌షిప్‌లు నిలుస్తాయని చెప్పారు. ఈ స్కాలర్‌షిప్‌లు సాధించిన వారు విదేశాల్లో పొందే వివిధ సదుపాయాలు, అవకాశాలు తెలియజేశారు. ఏ దేశంలో పరిశోధన చేయాలి అనే అంశంపై నిర్దిష్టమైన అవగాహనతో ఉండాలని సూచించారు.


