గిరి గుండెల్లో విత్తన సెగ
నిమ్మకు నీరెత్తినట్టు యంత్రాంగం
రాయితీ విత్తనాలు ఊసెత్తని వైనం
అధిక ధరలకు ప్రైవేట్ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్న గిరి రైతులు
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పాలకుల నుంచి స్పందన కరువు
రబీలో రైతులకు అండగా నిలవని టీడీపీ సర్కారు
విత్తన సెగ
హుకుంపేట మండలం తాడిపుట్టు ప్రాంతంలో రబీ సాగుకు దుక్కి పనుల్లో నిమగ్నమైన గిరి రైతు
సాక్షి,పాడేరు: గిరిజన రైతులు రబీలో రెండవ పంటగా వరిసాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నా ప్రభుత్వం నుంచి మాత్రం కనీస ప్రోత్సాహం కరువైంది. గత రబీ సీజన్‌లోను విత్తన సమస్య ఎదుర్కొన్న గిరిజన రైతులు ఈఏడాది అదే పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయఽశాఖ మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా మన్యంలో విత్తనాలకు డిమాండ్ లేదని చెబుతోంది.
● ప్రస్తుతం నీటి నిల్వలు అందుబాటులో ఉన్నందున రబీ సాగుకు గిరి రైతులు సిద్ధమయ్యారు. ఇందుకు అవసరమైన విత్తనాలను ప్రైవేట్ మార్కెట్‌లో కొనుగోలు చేసుకుంటున్నారు. తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే రకాల విత్తనాలను ఒడిశాలోని సిమిలిగుడలో ప్రైవేట్ విత్తన కేంద్రాల వద్ద కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. దుక్కి పనుల్లో నిమగ్నమయ్యారు. కొంతమంది తమ వద్ద దాచుకున్న సంప్రదాయ ఎంటీయూ 1021 విత్తనాలను నారుమళ్లకు వినియోగించాల్సిన దుస్థితి నెలకొంది.
● జిల్లా వ్యాప్తంగా గత రబీలో 2,361 హెక్టార్లలో నాట్లు వేశారు. ఈఏడాది కూడా అంతేవిస్తీర్ణంలో సాగు చేపట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారు130 రోజుల కన్నా తక్కువ వ్యవధిలో దిగుబడి నిచ్చే మేలు జాతి విత్తనాలు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని గిరిజన రైతులు ఆశతో ఎదురుచూస్తున్నా అందుకుతగ్గట్టుగా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రకృతి వ్యవసాయ విభాగం కూడా రబీలో విత్తన పంపిణీ ప్రక్రియకు దూరంగా ఉంది.
● రబీ సాగుకు వ్యవసాయశాఖ సలహాలు,సూచనలు ఇస్తున్నప్పటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని గిరి రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విత్తనాలకు డిమాండ్ లేకుంటే వారపు సంతలు, ఒడిశా ప్రాంతంలో అధిక ధరలకు ఎందుకు కొనుగోలు చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఖరీఫ్ మాదిరిగానే రబీకి విత్తన ప్రణాళికను ప్రభుత్వం రూపొందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఒడిశాలో విత్తనాలు కొన్నా
ప్రభుత్వం రబీసాగుకు విత్తనాలను పంపిణీ చేయకపోవడంతో విత్తన సమస్య అధికంగా ఉంది. ఐదు ఎకరాలలో వరితో పాటు కూరగాయల సాగు చేస్తా. వరి, ఇతర పంటల విత్తనాలను ఒడిశాలోని సిమిలిగుడ పట్టణంలో ప్రైవేట్ వ్యాపారుల వద్ద ఇటీవల కొనుగోలు చేసి తీసుకువచ్చా. ఒడిశా వెళ్లి రావడానికి రవాణా ఖర్చులతో పాటు విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా.
– శెట్టి ధనరాజు, గిరిజన రైతు, సొవ్వా, డుంబ్రిగుడ మండలం
గిరి గుండెల్లో విత్తన సెగ


