జి.మాడుగులలో 6.3 డిగ్రీలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. చలి, మంచు తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జి.మాడుగులలో 6.3 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 6.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం ఏడీఆర్, వాతావరణం విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ అరకువ్యాలీలో 8.7 డిగ్రీలు, పెదబయలులో 8.4 డిగ్రీలు, పాడేరు, చింతపల్లిలో 10.5 డిగ్రీలు, హుకుంపేటలో 11.1 డిగ్రీలు, కొయ్యూరులో 12.9 డిగ్రీలు నమోదైనట్టు ఆయన తెలిపారు.
● రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లిలో 13.6 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 14.4 డిగ్రీలు, వై.రామవరం 14.9 డిగ్రీలు, రంపచోడవరంలో 15.7 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 14.5 డిగ్రీలు, ఎటపాకలో 15.1 డిగ్రీలు నమోదైనట్లు ఏడీఆర్ పేర్కొన్నారు.
● గత రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినప్పటికీ శీతల గాలులు, చలి, మంచు తీవ్రత కొనసాగుతోంది. ఉదయం వేళలో 9 గంటలు దాటినప్పటికీ మంచు ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్ధులు, కూలీలు, చిరువ్యాపారులు, అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జి.మాడుగుల: మండలంలో చలి తీవ్రతకు అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి రోడ్డు మార్గంలోను, నుర్మతి, మద్దిగరువు, సొలభం గడుతూరు,వంజరి, గెమ్మెలి, లువ్వాసిగి, కుంబిడిసింగి రోడ్డుమార్గాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9గంటల వరకు పొగమంచు తెరలు దట్టంగా అలుముకున్నాయి. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హెడ్‌లైట్ల వెలుగులో రాకపోకలు సాగించారు.


