ఆర్‌అండ్‌ఆర్ పరిహారానికి 9,664 మంది గుర్తింపు
● రెండు రోజుల్లో జాబితా ప్రకటన
● అభ్యంతరాల స్వీకరణకు పది రోజుల గడువు
● తదుపరి డ్రాఫ్ట్ ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియ
● మిగతా వారికీ సర్వే
● చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్
చింతూరు: డివిజన్ పరిధిలోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో పోలవరం ఆర్‌అండ్‌ఆర్ పరిహారానికి 9,664 మంది నిర్వాసితులు ప్రస్తుతానికి అర్హులుగా తేలినట్టు స్థానిక ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ వెల్లడించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఏఎస్పీ బొడ్డు హేమంత్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు మండలాల్లో సామాజిక ఆర్థిక సర్వే(ఎస్‌ఈఎస్) ప్రకారం 12,368 ఆర్‌అండ్‌ఆర్ పరిహారం జాబితాలో ఉండగా అన్ని ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఇప్పటివరకు 9,664 మంది అర్హులుగా తేలినట్లు తెలిపారు. వీరికి సంబంధించిన జాబితాను శుక్రవారం నుంచి ఆయా మండలాల తహసీల్దార్, మండల పరిషత్, గ్రామ సచివాలయ కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. జాబితా వెల్లడి అనంతరం ఎవరికై నా అభ్యంతరాలుంటే పది రోజుల్లో ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయం లేదా ఆర్‌అండ్‌ఆర్ కార్యాలయంలో అందించాలని ఆయన సూచించారు.
● అభ్యంతరాల సమయం ముగిసిన వెంటనే డ్రాఫ్ట్ ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియ చేపడతామని పీవో తెలిపారు. మిగిలిన వారికి సంబంధించి ప్రస్తుతం తమ బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయని, సర్వే ప్రక్రియ పూర్తయిన తరువాత వారిలో అర్హులైన వారిని గుర్తించి మరో జాబితా వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి మూడు మండలాల్లో ఇప్పటివరకు 75 శాతం ప్రక్రియ పూర్తయిందని మరో 25 శాతం ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం నుంచి వెల్లడించనున్న అర్హుల జాబితాలో పేర్లు లేనివారు ఎవరూ ఆందోళన చెందవద్దని వారికి సంబంధించిన అన్నిరకాల ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులైన వారందరినీ ఆర్‌అండ్‌ఆర్ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటామని పీవో వెల్లడించారు.
పరిహారానికి రూ.600 కోట్లు మంజూరు
ఫేజ్ 1–బీలోని 30 గ్రామాల్లో భూములు, గృహాల విలువ చెల్లించే నిమిత్తం రూ 600 కోట్లు మంజూరైనట్లు పీవో తెలిపారు. ఇప్పటికే గిరిజన నిర్వాసితులకు సంబంధించి 22 గ్రామాల్లో భూమికి భూమి, పునరావాసం, కాలనీల నిర్మాణం ప్రక్రియ జరుగుతోందని, గిరిజనులకు ఇతర గిరిజన ప్రాంతాల్లో పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గిరజనేతరులకు సంబంధించి 3,600 కుటుంబాలకు ఏలూరు జిల్లా తాడ్వాయిలో పునరావాసం కల్పించడంతో పాటు మరో రెండు ప్రాంతాల్లో కాలనీల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సమస్యలు సృష్టిస్తే చర్యలు : ఏఎస్పీ హేమంత్ హెచ్చరిక
ప్రస్తుతం జరుగుతున్న ఆర్‌అండ్‌ఆర్ సర్వే ప్రక్రియలో ఎవరైనా సమస్యలు సృష్టించాలని చూస్తే చట్టపరంగా చర్యలు చేపడతామని చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ హెచ్చరించారు.. క్షేత్రస్థాయిలో సర్వే సిబ్బందిపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని, విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆటంకం కలిగించడం సరికాదని ఆయన హితవు పలికారు. ఏమైనా సమస్యలుంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని, పరిహారం విషయంలో కుటుంబాల మధ్య ఏవైనా కలహాలుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అమాయక గిరిజనులకు మాయమాటలు చెప్పి పోలవరం పరిహారం కాజేయాలని చూసే ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ఏఎస్పీ తెలిపారు. నిర్వాసితులు తమ పరిహారం సొమ్మును ప్రభుత్వరంగ బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలని, అధిక సొమ్ముల ఆశతో ప్రైవేటు కంపెనీల చేతుల్లో మోసపోవద్దని ఆయన సూచించారు.


