తారురోడ్డు పనుల్లో నాణ్యతకు తిలోదకాలు
ముంచంగిపుట్టు: మండలంలోని దార్రెల పంచాయతీ కోడాపుట్టు మీదుగా చికుచింత గ్రామానికి వేస్తున్న తారురోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించాయి. మెటల్ ఏర్పాటుచేసిన కాంట్రాక్టర్ రోడ్డు పనులను కొద్దిరోజులుగా నిలిపివేశాడు. దీంతో కోడాపుట్టు,చికుచింత గ్రామాల గిరిజనులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన కాంట్రాక్టర్ నిర్మాణ పనులు మొదలు పెట్టి, తూతూమంత్రంగా చేశాడు. పనులు చేపట్టిన వారం రోజుల్లేనే తారు లేచిపోయి నాణ్యతాలోపం బయట పడింది. దీంతో రోడ్డు అధ్వాన పరిస్థితిపై గ్రామాల గిరిజనులు ఆందోళనకు దిగారు. ఇష్టానుసారంగా రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకంగా పనులు చేపట్టి కాంట్రాక్టర్,అధికారులు చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వారం రోజులకే తారురోడ్డు పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. తక్షణమే పంచాయతీరాజ్ అధికారులు స్పందించి కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై పీఆర్ ఏఈ మురళీకృష్ణను వివరణ కోరగా రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించని విషయాన్ని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
తారురోడ్డు పనుల్లో నాణ్యతకు తిలోదకాలు


