ఆదిలాబాద్ రీజియన్‌లో డిజిటల్ బాట
ప్రయాణికుల అభిప్రాయాల కోసం స్కానర్ ఏర్పాటు
లోపాలను సరిదిద్దేందుకు సరికొత్త అడుగు
మంచిర్యాలఅర్బన్: రాజేష్ అనే ప్రయాణికుడు హైదరాబాద్ వెళ్లడానికి లగ్జరీ బస్సు ఎక్కాడు. అందులో మంచినీళ్ల బాటిల్ ఇవ్వలేదు. ఫిర్యాదు చేయాలంటే బస్‌స్టేషన్, డిపో వరకు రావాల్సి వచ్చేది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు కలుగకుండా సేవలపై అభిప్రాయాలు వ్యక్తం చేసేలా ఆర్టీసీ డిజిటల్ ఫీడ్‌బ్యాక్ బాట పట్టింది. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఏయే రూట్లు, ఏయే డిపోల పరిధిలో లోపాలు ఉన్నాయో ఉన్నతాధికారులు గుర్తించి తక్షణమే సరిదిద్దనున్నారు. సిబ్బంది పనితీరును అంచనా వేయడంతోపాటు ప్రయాణికుల ఫిర్యాదులకు సత్వరం పరిష్కారం చూపి మరింత పాదర్శకంగా మార్చడానికి క్యూఆర్ కోడ్ స్కానర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, భైంసా, మంచి ర్యాల, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్ డిపో బస్సుల్లో ప్రయాణికులు నేరుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేలా ప్రత్యేక గూగుల్ ఫారమ్ అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణించిన బస్సు డిపోను ఎంచుకుని వాహన నంబరు, సర్వీస్ నంబరు నమోదు చేసి ఒకటి నుంచి ఐదు వరకు రేటింగ్ ఇవ్వవచ్చు. ప్రధానంగా ఐదు అంశాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
డిజిటల్ ఫీడ్‌బ్యాక్ ఇలా..
ఉమ్మడి జిల్లాలోని డిపోల్లో 647 బస్సులు ఉండగా.. ఇందులో ఆర్టీసీ 352, అద్దెబస్సులు 295 ఉన్నా యి. మొదటి విడతలో 93 సూపర్‌లగ్జరీ, 14నాన్ ఏసీ లహరి, 12 లహరి ఏసీ బస్సుల్లో డిజిటల్ ఫీడ్‌బ్యాక్ అమలు చేస్తున్నారు. బస్సులో డ్రైవర్ వెనుక క్యాబిన్‌కు స్కానర్ ఏర్పాటు చేశారు. స్కాన్ చేయగానే బస్సు పరిశుభ్రత(బస్సు లోపల, బయట ఏ విధంగా ఉంది), ప్రయాణ సౌకర్యం(సీట్ల నాణ్యత, ప్రయాణం సౌకర్యవంతంగా ఉంది), సిబ్బంది ప్రవర్తన(డ్రైవర్లు, కండక్టర్లు మర్యాదగా వ్యవహరిస్తున్నారా లేదా), సమయపాలన(నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారా లేదా), ఇతర వసతులు(బస్సుల్లో మంచినీటి బాటిళ్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు వంటి అదనపు సౌకర్యాలు), ప్రయాణ అనుభవానికి సంబంధించి మొత్తంగా రేటింగ్ సేకరిస్తున్నారు.


